Telangana Merger: స్వేచ్ఛ బ్యూరో: సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన, మరపురాని రోజని, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు నాంది పలికిన మహత్తర ఘట్టమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనకు స్పష్టమైన మార్గం సుగమమైందన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజల త్యాగాలను స్మరించుకుంటూ, అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్నారు. తెలంగాణ స్వేచ్ఛా పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకో, వర్గానికో లేదా ప్రాంతానికో పరిమితమైంది కాదని, ఇది ప్రజల హక్కులు, ఆత్మగౌరవం మరియు ప్రజాస్వామ్యం కోసం జరిగిన చారిత్రక పోరాటమని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించకుండా, నాటి పోరాటంలో భాగమైన అన్ని వర్గాల త్యాగాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
చరిత్రను విభజనకు కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా మలచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, ప్రజల హక్కులు, సంక్షేమం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే నాటి పోరాట వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, నాటి స్ఫూర్తితో తెలంగాణను మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
Also read: సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!