Cyberabad Police: స్వేచ్ఛ బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సొంతదారులకు 11వ విడత మొబైల్ ఫోన్ల అప్పగింత కార్యక్రమం బుధవారం జరిగింది. ఇందులో భాగంగా సీపీ డాక్టర్ ఎం.రమేశ్ 2.43కోట్ల విలువ చేసే 1,218 సెల్ ఫోన్లను బాధితులకు అందించారు. రికవరీ చేసిన వాటిలో సీసీఎస్ కూకట్ పల్లి పోలీసులు 410, సీసీఎస్ శేరిలింగంపల్లి పరిధిలో 407, సీసీఎస్ కుత్బుల్లాపూర్ పరిధిలో 401 ఫోన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సీపీ రమేష్ మాట్లాడుతూ ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు.
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ (సీఈఐఆర్) ద్వారా ఫోన్లను సులభంగా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధికి, వ్యక్తిగత అవసరాలకు కీలక సాధనంగా మారిందన్నారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి యజమానులకు అప్పగించి వారిలో మళ్లీ ఆనందాన్ని నింపడం బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. ముఖ్యంగా జాబ్ ఫ్రాడ్, బెట్టింగ్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ నెంబర్ ను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని చెప్పారు.
Also read: భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది
రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, బస్ స్టాపులు, ఉత్సవాలు జరిగే ప్రదేశాల్లో జాగ్రతగా ఉండాలని చెప్పారు. ఎవరైనా దూర ప్రాంతాలకు, విహార యాత్రలకు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఎట్టి పరిస్తితి లో కూడా సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేయవద్దన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ టీమ్, పోలీసు అధికారులను సీపీ అభినందించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని తిరిగి పొందిన పలువురు బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, క్రైమ్స్ ఏసీపీలు నాగేశ్వర్ రావు, వెంకటేష్, సీఐలు జగదీశ్వర్, సత్యనారాయణ, విజయ్, మురళీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also read: విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే