Flood Risk: స్వేచ్చ బ్యూరో: ప్లానింగ్ లేని పట్టణీకరణ కారణంగానే వరద ముప్పు పొంచి ఉంటుందని, సహజ నీటి వనరులు, చెరువులు కబ్జాలకు గురయితే భారీ వర్షాలు కురిసినపుడు వరదలు ముంచెత్తే పరిస్థితులు నగరాల్లో నెలకొన్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి తరుణంలో ప్రాణ, ఆస్తి నష్ట నివారణలో ప్రభుత్వ విభాగాలతో పాటు యువ ఆపదమిత్రులు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. నాగోలులోని హైడ్రా శిక్షణ కేంద్రంలో యువ ఆపదమిత్ర 5వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారికి కమిషనర్ దిశానిర్దేశం చేశారు. నగరంలో 69 శాతం చెరువులు కబ్జాకు గురయ్యాయని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాల ద్వారా తేల్చి చెప్పిందని, చెరువులను కాపాడుకుంటే చాలా వరకు వరదలు కట్టడి చేయవచ్చునని ఆయన వివరించారు. అందుకే చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇప్పటి వరకు చూశామని, హైడ్రా ఇందుకు భిన్నమని కమిషనర్ వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించి ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం లేకుండా చూడాలనేదే హైడ్రా ప్రధాన సంకల్పమని ఆయన వివరించారు. భారీ వర్షాల సమయంలో వరద నీరు నాలాల ద్వారా చెరువులకు చేరేలా హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. నాలాలు, చెరువుల అభివృద్ధితో వరదలు కట్టడి చేయవచ్చునని ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ విషయం రుజువైందని కమిషనర్ పేర్కొన్నారు.
Also read: కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!
నగరంలో అక్రమ కట్టడాలు భూకంపాలతో సమానమైన ప్రమాదాన్ని సూచిస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. కేవలం 50 గజాలలో ఏడెనిమిది అంతస్తులు భవనాలు నిర్మించడంతో పరిసర ప్రాంత నివాసితులకు అవి ముప్పుగా మారుతున్నాయని, ఇటీవల గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో 7 అంతస్తుల భవనం కూలిపోవడంతో పాటు, 2024లో సిద్ధిఖ్ నగర్‌లో పక్కకు వంగిన భవనం, దేశరాజధానిలో కుప్పకూలిన ఘటనలను ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ప్రస్తావించారు. ఇవన్నీ మానవ తప్పిదాలతో ఏర్పడిన వైపరీత్యాలుగా హైడ్రా కమిషనర్ అభివర్ణించారు. చదువులు కొనసాగిస్తూనే, సమాజ సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన మీరంతా అభినందనీయులేనని అభినందించారు.
5వ బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న 117 మంది వాలంటీర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు హైడ్రాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. స్థానికంగా ఉంటారు, విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగడంతో పాటు ప్రభుత్వ విభాగాలకు సమాచారమిచ్చి నష్ట నివారణలో ముందుండాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్లు ఆర్. సుదర్శన్, డి. ఆనంద్‌కుమార్ యువ ఆపదమిత్రులనుద్దేశించి పలు సూచనలు చేశారు. హైడ్రా ఏడీఎఫ్‌ఓ మోహన రావు, వారం రోజుల శిక్షణ సాగే తీరును వివరించారు. హైడ్రా ఆర్ ఎఫ్‌ఓ జయప్రకాష్, డీఎఫ్‌ఓలు శ్రీధర్ రెడ్డి, గౌతమ్, మై భారత్ హైదరాబాద్ జిల్లా యూత్ ఆఫీసర్ శషాంక్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారిణి గ్రీష్మ చంద్రిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్ ఉగ్ర సంస్థగా ప్రకటన!