BRS Land: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో పర్యటఇంచి గణేశ్ నిమిజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉత్సాహంగా నిమజ్జనోత్సవాలు జరుపుకునేలా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చేయాలని అధికారులను కోరారు. అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందన్నారు. మరి 90 మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బండి ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని బండి ఆరోపించారు. పాదయాత్రలో తాను బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ తన తలను 6 ముక్కలు చేస్తానన్నారని గుర్తుచేశారు.
అయినా కేసీఆర్ మెడలు వంచి ఫాంహౌజ్ నుంచి గుంజుకొచ్చి ప్రజల ముందుంచానని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా?, ఏఐసీసీకి కట్టాల్సిన ఈఎంఐ గడువు ముంచుకొస్తుండటంతో ఒత్తిడి పెరిగిందా? లేక అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా? అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా సిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీలు ఏమయ్యాయని బండి ప్రశ్నించారు. బేరాలు కుదరగానే సిట్ ను నీరుగార్చడం సీఎంకు అలవాటే అని చురకలంటించారు. సీఎం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లా కమిటీలు మారాయని మండిపడ్డారు.
Also read: అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!
ఈ భూములపై కూడా విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు లాగుతారని, జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే.. 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారన్నారు. 30 రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారా? అని సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లు, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం, గొర్రెల స్కాం సహా కేసులన్నీ ఏమయ్యాయని నిలదీశారు. ఫారెస్ట్ భూములను కబ్జా చేసిన వాళ్లపై చర్యలేవని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేయాలని మోడీ తాపత్రయపడుతున్నారని, అందులో భాగంగా బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేస్తే.. వాటికి కేటాయించిన భూములను సైతం బీఆర్ఎస్ కబ్జా చేశారని బండి ఆరోపించారు. బీఆర్ఎస్ వేల ఎకరాల భూములను దోచుకుంటే.. వాళ్లతో బేరాలాడటమే కాంగ్రెస్ పనా? అని ప్రశ్నించారు.
రూ.లక్షల కోట్ల విలువైన ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే బీఆర్ఎస్ భూముల చిట్టా విప్పారని ప్రజలకు అర్థమైందన్నారు. భూముల విచారణ పేరుతో బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం ఖాయమని, యూపీ ఎన్నికల కోసం అవసరమైన డబ్బులను బీఆర్ఎస్ సర్దడం తథ్యమని కేంద్ర మంత్రి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ దండయాత్ర చేస్తామని, ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెడతామని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని బండి మండిపడ్డారు.
సీఎం మాట చెబితేనే అది శాసనం కావాలని, కానీ బీఆర్ఎస్ తో బేరసారాల కోసం భూదోపిడీని వాడుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందాలపై జనం తిరగబడే రోజులు రాబోతున్నాయని బండి ధీమా వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల కోసం రూ.1.5 కోట్లను కేటాయించామని బండి తెలిపారు. గతేడాదితో పోలిస్తే మూడింతలు ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా మూడు రోజుల ముందే నీళ్లను విడుదల చేయాలని, ప్రజల సెంటిమెంట్ తో ఆటాలాడితే సహించే ప్రసక్తే లేదని బండి హెచ్చరించారు.
Also read: జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!