Supreme Court: ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చట్టపరంగా ఒక కీలక పరిణామంలో పెద్ద చుక్కెదురైంది. కంటోన్మెంట్ ప్రాంతంలో వివాదాస్పదంగా మారిన 40 ఎకరాల స్థలం తమదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ భూమిపై ఇదివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. అక్కడ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ హక్కులకే న్యాయస్థానం పూర్తి ఊరటనిచ్చింది.
219 రోజుల ఆలస్యమే కొంపముంచింది
ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కూడా సరైన సమయంలో స్పందించకుండా, దాదాపు 219 రోజుల సుదీర్ఘ ఆలస్యంతో పిటిషన్ దాఖలు చేయడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ గడువు దాటిన ఆలస్యాన్ని కారణం చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కంటోన్మెంట్లోని 40 ఎకరాల భూమి పూర్తి హక్కులు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్‌కే చెందుతాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
కోర్టు ధిక్కరణ భయం నుంచి రంగనాథ్‌కు తాత్కాలిక ఊరట
ఇదే స్థలం విషయంలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టారనే ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రమైన కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ నిర్ణయంపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి తాత్కాలికంగా స్టే పొందడంతో ప్రస్తుతానికి పదవి ముప్పు నుంచి గట్టెక్కారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ కేసు తదుపరి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో, ఐఏఎస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
Also Read: సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!