Medaram Jatara: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది. నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతరకు సుమారు కోటిన్నర మంది భక్తులు హాజరైనట్లు సమాచారం. మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1000 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. భక్తులు 14 లక్షల మేకలు, గొర్రెలను మొక్కు తీర్చుకున్నారు. ఒక్క మద్యం కోసమే రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక మాంసం, మద్యం కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వీటితో పాటు కోటికి పైనా కొబ్బరి కాయలు, 500 టన్నుల బెల్లం విక్రయాలు జరిగాయి.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పేరుగాంచింది. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు పాటు తల్లులు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సమర్పించిన నిలువెత్తు బంగారంతో పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మలు గద్దెలను వీడి వన ప్రవేశం చేశారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు తల్లులను శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయించారు. దీంతో ఈ ఏడాది మేడారం మహా జాతర ముగిసింది.
మేడారం జాతరలో ఆధ్యాత్మికతతో పాటు భారీగానే ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో జరిగిన వ్యాపారం కోట్లలో ఉంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చిన మేడారం జాతరలో మద్యం, మాంసం విక్రయాలే సుమారు రూ. 400 కోట్లకు పైగా జరిగినట్లు ప్రాథమిక అంచనా. మేడారం జాతరలో మొక్కులు ప్రధానంగా ఉంటాయి. తమ స్థాయికి తగ్గట్లు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు తీర్చిన తల్లులకు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలో ములుగు జిల్లా వ్యాప్తంగా మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జాతర ప్రాంగణంలో మటన్ కిలోకు రూ. 1,200 నుండి రూ. 1,500 వరకు పలికింది. బోన్‌లెస్ మటన్ రూ. 1,600 కూడా చేరింది.
Also Read: మేడారం మహా జాతర ఖర్చు వెయ్యి కోట్లు!.. మద్యం, మాంసానికే రూ.400 కోట్లట!
సాధారణంగా చికెన్ ధర రూ. 200 కాగా జాతర ప్రాంతంలో రూ. 350 నుండి రూ. 450 విక్రయించారు. లక్షల సంఖ్యలో మేకలు, పొట్టేళ్లు, కోళ్ల విక్రయాలు జరిగాయి. దీంతో వందల కోట్ల రూపాయల చేతులు మారినట్లు తెలుస్తోంది. జాతరలో మాంసాహార విందులతో పాటు మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని వైన్ షాపులు, బార్లు, అనధికారి బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మద్యం, మాంసం విక్రయాలే రూ.400 కోట్లు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఇక జాతర ఖర్చు రూ.1000 కోట్లకు పై మాటే అంటున్నారు.