HCU : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రుల బృందం తేల్చి చెప్పింది. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటిలు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి.. అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. తాము HCU భూములను ముట్టుకోవడం లేదని.. ఆ 400 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తియేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రులు.
ఐటీ కంపెనీల కోసమే : డిప్యూటీ మంత్రి భట్టి
రాష్ట్ర ప్రజల భవిషత్తు కోసం.. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో తమ స్వార్థం కానీ, సీఎం స్వార్థం కానీ ఏమీలేదన్నారు భట్టి. HCUతో తమకూ ఎమోషనల్ బాండ్ ఉందని.. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకోవడం లేదని.. ఆ 400 ఎకరాలు వర్సిటీ భూములు కావని స్పష్టం చేశారు. మార్షమ్, అంబేర్ల రాక్, పీకాక్ లేక్ ను డిస్ట్రబ్ చెయ్యడం లేదన్నారు.
అంతా చట్ట ప్రకారమే : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. బీఆర్ఎస్, బీజేపీలు పని గట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వారం రోజుల కిందట యూనివర్సిటీ
వీసీ, రిజిస్ట్రార్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యామని.. వారి విజ్ఞప్తి మేరకు తమ ప్రభుత్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నామని చెప్పారు. అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులకు ఎలాంటి ఆపదా లేదన్నారు. అసత్య ప్రచారం నమ్మొద్దన్నారు. 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తాము అధికారంలోకి వచ్చాక సరిదిద్దామని శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడి సాధించిందని.. ఇందుకు తమను అభినందించాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
ఆ ఫెవికాల్ బంధం ఎవరిది? : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
400 వందల ఎకరాల చుట్టూ ఉన్న ఫెవికాల్ బంధాలను తెంచుకోలేక బీఆర్ఎస్, బీజేపీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. ఆనాడు 400 ఎకరాలు కొట్టేయాలని చూశారని అది కుదరకపోవడంతో ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ల్యాండ్ చుట్టూ హైరైజ్ భవనాలకు గత ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందంటూ ప్రశ్నించారు. అంత ఎత్తైన భవనాలు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా అని నిలదీశారు. విద్యార్థుల ముసుగులో ACP స్థాయి పోలీస్ అధికారిని కొట్టారని.. HCU లో విపక్షాలు కిరాయి మనుషులను పెట్టారని ఆరోపించారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు HCU ఓల్డ్ స్టూడెంట్స్ అని గుర్తు చేశారు. HCU భూములకు, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఈ ఇద్దరూ సీఎంతో మాట్లాడారని చెప్పారు. 2022లో యూనివర్సిటీ భూమి నుంచి రోడ్ వేసేటప్పుడు VC కోర్టుకు వెళ్తే యూనివర్సిటీకి హక్కు లేదని కోర్టు చెప్పిందని.. కానీ, HCU భూమికి టైటిల్ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి అన్నారు.