తెలంగాణలో బీఆర్ఎస్ కి జనాదరణ తగ్గుతుందన్నప్పుడల్లా సెంటిమెంట్ రాజేయడం ఆ పార్టీకి, ఆ పార్టీ నేతలకు అలవాటే. ఆ మాటకొస్తే తెలంగాణపై పేటెంట్ హక్కు తమదేనని హడావిడి చేస్తుంటారు గులాబీ నేతలు. మరి తెలంగాణ ఏర్పాటుకోసం కాంగ్రెస్ చేసిందేంటి..? కాంగ్రెస్ నాయకులు పదవుల్ని వదులుకోలేదా..? సీమాంధ్రలో పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ విభజన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదింపజేయలేదా..? తెలంగాణ ఏర్పాటులో ఎవరి కృషి ఎంత ఉన్నా.. అంతా తమదేనని చెప్పుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటే. అయితే ఇటీవల కాలంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. అభివృద్ధి కోరుకుంటున్నారు, అభివృద్ధికే జై కొడుతున్నారు. ఇక్కడే బీఆర్ఎస్ కి నష్టం వచ్చింది, కష్టం వచ్చిపడింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. అన్న ఒకదారి, చెల్లి మరోదారి, మీమాంసలో మిగతా బంధుగణం అన్నట్టుగా తయారయ్యాయి బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్. ఈ క్రమంలో తాజాగా జాగృతి జెండాలు, అజెండాలు, కండువాలతో బయటకొస్తున్న ఎమ్మెల్సీ కవిత మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీని తిడితే, ఏపీ నాయకుల్ని కామెంట్ చేస్తే, తెలంగాణలో తమ క్రేజ్ పెరుగుతుందనే భ్రమల్లో ఉన్నారు కవిత. అందుకే ఆంధ్రోళ్ల బిర్యానీ అంటూ సెటైర్లు పేల్చారు.
ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటం?
ఆంధ్రా బిర్యానీ ఎలా ఉంటదో కేసీఆర్ సార్ చెప్పిండు కదా
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత pic.twitter.com/KblOW8qxjj
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025
ఆంధ్రా చేపల పులుసు..
ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటం? ఆంధ్రా బిర్యానీ ఎలా ఉంటదో కేసీఆర్ సార్ చెప్పిండు కదా.,. అంటూ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు కవిత. బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాక్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని ఆరోపించారు కవిత. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆమె చెప్పారు. అయితే కవిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిందేంటని నిలదీస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో వైసీపీ నేత రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఏం మాట్లాడారో కవితగు గుర్తు లేదా అని కౌంటర్లిస్తున్నారు. ఆంధ్రా చేపల పులుసు అంత ఇష్టంగా తిన్న కేసీఆర్, ఆంధ్రోళ్ల బిర్యానీ గురించి కామెంట్ చేశారంటూ కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఢిల్లీ లిక్కర్ సంగతేంటి..?
ఆంధ్రోళ్ల బిర్యానీ సంగతి సరే మరి ఢిల్లీ లిక్కర్ సంగతేంటని కవితను సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ లిక్కర్ ఇష్టంలేకే ఢిల్లీ లిక్కర్ దందాలో మునిగితేలారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు పదవులు లేకపోతే.. ఆంధ్రా బిర్యానీ, ఆనపకాయ, యాస, జాతి, భాష అర్జెంటుగా గుర్తుకు వచ్చేస్తాయంటూ ఒకరు కామెంట్ పెట్టారు. “గత 11 ఏళ్లలో మీరు మీ కుటుంబ సభ్యులు ఆంధ్రోళ్ళ ఇళ్ళలో, పెళ్లిళ్లలో, ఇతర శుభకార్యాలలో భోజనం చేసిన సందర్భాలు ఒక్క సారి గుర్తుతెచ్చుకోండి మేడం” అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ఇక బీఆర్ఎస్ పేరు మార్చాలంటూ మరో నెటిజన్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా ఉండటానికి వీల్లేదన్నారు. ఆంధ్ర ప్రాంతంపై అక్కసు వెళ్లగక్కుతున్న ఆ పార్టీ నేతలు, ఆంధ్రా రహిత భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మొత్తమ్మీద ఆంధ్రా బిర్యానీ అంటూ కవిత మరోసారి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని, ఆ మంటలో చలికాచుకోవాలని చూస్తూ నెటిజన్లకు బుక్కయ్యారు.