MP Chamala Kiran Kumar Reddy: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) సాధించిన ఘనవిజయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని ఆయన కొనియాడారు. కేరళలో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి అక్కడి స్థానిక భాషలో నీ పో మోనే విజయన్(నీ సమయం అయిపోయింది విజయన్.. ఇక వెళ్ళిపో) అంటూ ఇచ్చిన పంచ్ డైలాగ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు. ఈ నినాదం కేరళ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయి ఎల్డీఎఫ్ (LDF) ప్రభుత్వ పతనానికి నాంది పలికిందని ఆయన విశ్లేషించారు.
గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా వెళ్లిన ఏ నాయకుడూ ఈ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయలేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తన వాగ్ధాటితో పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తీరు అద్భుతమని ప్రశంసించారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి తమ భాషలో మాట్లాడుతూ తమ సమస్యలపై పోరాడటం కేరళ ఓటర్లను ఆలోచింపజేసిందని చెప్పారు. దీని ఫలితంగానే ప్రస్తుతం కౌంటింగ్‌లో యూడీఎఫ్ కూటమి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం దిశగా అడుగులు వేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్ పార్టీని ఎలాగైతే గద్దె దించారో.. అదే వ్యూహాన్ని కేరళలోనూ అమలు చేసి కాంగ్రెస్ కూటమిని విజయపథంలో నడిపించారని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ప్రతి రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి వంటి సమర్థవంతమైన నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి శైలి.. ఆయన పోరాట పటిమ.. ప్రజాకర్షణ ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
కేరళ విజయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదని.. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఎంపీ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకత్వం అందుబాటులోకి రావడం వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో రేవంత్ రెడ్డి సృష్టించిన ఈ ఇంపాక్ట్ జాతీయ రాజకీయాల్లో ఆయన ఇమేజ్‌ను మరింత పెంచిందని విశ్లేషించారు.
Read Also: వయనాడ్‌లో యూడీఎఫ్ క్లీన్ స్వీప్.. కేరళం ఓటర్ల తీర్పు అమోఘం: ప్రియాంక గాంధీ