LIG Indiramma Housing Scheme: హైదరాబాద్ సిటీలో సొంతింటి కలను సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ-CURE పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజలకు లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం గరిష్టంగా 10 అంతస్తుల వరకు టవర్లను నిర్మించనుంది.
రేవంత్ సర్కార్ కొత్త పథకం-పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం విడుదల చేయనుంది.
క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం-తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో గ్రేటర్ హైదరాబాద్ మినహా 32 జిల్లాల పరిధిలో దాదాపు 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయి. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అదనంగా క్యూర్ పరిధిలో పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా మరో లక్ష ఇళ్లను నిర్మించనుంది.
10 అంతస్తుల టవర్ల నిర్మాణం-ఈ పథకం అమలు కోసం ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే గుర్తించింది. నియోజకవర్గాల వారీగా ఎన్ని ఫ్లాట్లు నిర్మించవచ్చు అనేదానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. దీని కార్యాచరణకు ఇవాళ అడుగులు వేయనుంది.
కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాల గుర్తింపు-క్యూర్ పరిధిలో తొలి విడతలో 26 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా తెలిపారు. ఆదివారం ఉన్నతాధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ALSO READ: తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!
క్యూర్ పరిధిలోని ఎల్‌ఐజీ ఇళ్ల కోసం ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. పేదలు ఉంటున్న ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. వీలైటే 10 అంతస్తుల వరకు నిర్మాణం చేపడతామని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తున్నామని, ప్రజలు తమ తమ నియోజకవర్గం పరిధిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.