– నీట మునిగిన పాలమూరు ప్రాజెక్ట్ పంప్‌హౌస్
– చెరువుల నుంచి ఉప్పొంగిన వరద
– సొరంగ మార్గంలోకి చేరిన నీరు
– లోపల 20 కిలోమీటర్ల మేర నిలిచిన వరద
– ఇప్పటికే 4 మోటార్ల బిగింపు
– డీ వాటరింగ్ తర్వాత నష్టంపై అంచనా
Telangana: దక్షిణ తెలంగాణకు వరదాయని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఎన్నో ఏళ్లుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే, వరదల నేపథ్యంలో ప్రాజెక్ట్‌లో భాగమైన కుమ్మెర వద్ద ఉన్న వట్టెం పంప్‌హౌస్ నీటమునిగింది. ప్యాకేజీ 7లోని ఆడిట్ నుంచి పంప్‌హౌస్ సొరంగ మార్గంలోకి వరద నీరు ఒక్కసారిగా వచ్చింది. నాగనూలు, నాగర్ కర్నూల్ చెరువుల నుంచి భారీగా వరద ప్రవాహం రావడం వల్లే ఇది జరిగింది. సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర సొరంగ మార్గంలో వరద నీరు నిలిచిపోయింది.
మోటార్ల పరిస్థితి ఏంటో?
కొద్ది రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులు ఫుల్ అయ్యాయి. శ్రీపురం, తూడికుర్తి, నాగనూలు చెరువులు అలుగు పారుతున్నాయి. వీటి సమీపంలో పీఆర్ఎల్ఐ పథకం టన్నెల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెరువుల నుంచి వరద నీరు సర్జిపూల్‌లోకి వచ్చి గేట్ల ద్వారా పంప్‌హౌస్‌లోకి చేరింది. ఈ పంప్‌హౌస్‌లో 10 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 4 మోటార్లను ఏర్పాటు చేశారు. ఇంకో మోటార్ నిర్మాణ దశలో ఉంది. ఈ సమయంలో వరద నీరు ముంచెత్తడంతో మోటార్ల పరిస్థితి ఏంటనే డౌట్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
గతంలో కాళేశ్వరం పంప్‌హౌస్‌ల మునక
కేసీఆర్ హయాంలో గోదావరికి వరద పోటెత్తిన సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగాయి. కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌ల్లోకి వరద నీరు ముంచెత్తింది. అంతేకాదు, మేడిగడ్డకు వెళ్లే విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా కుప్పకూలింది. 2022 జులైలో జరిగిన ఈ ఘటనపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రాజెక్ట్ నాణ్యత విషయంలో అనుమానాలకు తావిచ్చింది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో రక్షణ గోడ కూలిపోవడంతో మోటార్లు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా కడుతున్న వట్టెం పంప్‌హౌస్‌లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో పంప్‌హౌస్‌ల పరిస్థితిపై చర్చ జరుగుతోంది.
Also Read: Minister Ponnam: చేనేత శాలువాలను ఉపయోగించండి: విద్యా శాఖకు మంత్రి పొన్నం సూచనలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకంటే?
పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా, వాడుకోలేని పరిస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ వాసులది. నదికి చాలా ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం. కృష్ణా నదిలో మిగులు, వరద నీటిని వాడుకునేందుకు, మోటార్ల సాయంతో ఎత్తిపోసే ప్లాన్ చేసింది ప్రభుత్వం. దానికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌గా నామకరణం చేసి పనులు మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ లో ఐదు పంప్‌హౌస్‌లు ఉంటాయి. ఆరు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా 67 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేయాలనేది ప్లాన్. ఐదు పంప్‌హౌస్‌ల్లో 34 మోటార్లను పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి వికారాబాద్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతుంది.