– శాంతకుమారిని కలిసి వెల్లడించిన నేతలు
– పునరావాస కార్యాక్రమాల్లోనూ పాల్గొంటామని హామీ
– త్వరలో సీఎంను కలుస్తామని వెల్లడి
– సీఎం రిలీఫ్ ఫండ్‌కు నెలవేతమిచ్చిన ఎమ్మెల్సీ మల్లన్న
Telangana Flood: గత నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలతో కుదేలైన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులూ తమ వంతుగా రూ. 130 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి తమ పెద్దమనసు చాటుకున్నారు. మూల వేతనంలో ఒక రోజు జీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
జేఏసీ నేతృత్వంలో..
వరద బాధితుల క్షేమం కోసం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పక్షాన ఈ సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్లు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒకరోజు మూలవేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుండి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతకుమారిని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు, తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారని.. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నామని జేఏసీ నేతలు తెలిపారు.
Also Read: Villages merged into Municipalities: 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. ఏ ఏ గ్రామాలయ్యాయంటే..?
సీఎంకు అందజేత..
మంగళవారం జేఏసీ ఛైర్మన్ జగదీశ్, సెక్రటరీ జనరల్ ఎల్లూరి శ్రీనివాస్ రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ తీర్మానం చేశారు.దీనికి సంబంధించిన పత్రాన్ని ముఖ్యమంత్రిని కలిసి సీఎం సహాయనిధికి అందజేస్తామని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మీడియాకు తెలిపారు. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో ఉద్యోగులు కూడా పాలుపంచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, ఈ విపత్తు నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
Also Read: Pawan Kalyan: గత ప్రభుత్వాన్ని విమర్శించి వేస్ట్.. నేను ఎందుకు రాలేదంటే?: డిప్యూటీ సీఎం పవన్
తీన్మార్ మల్లన్న విరాళం..
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వరద ముంపు బాధితులకు తన వంతు సాయంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఒక నెల వేతనాన్ని ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వచ్చిన వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆ జిల్లాల ఎమ్మెల్సీగా తన నెల జీతం రూ.2.75లక్షల విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సాయన్ని ప్రకటించిన ఆయన ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. ఈ మేరకు చెక్కు పంపడంతోపాటు క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.