Assembly Row: స్వేచ్ఛ బ్యూరో: శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలంతా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సొల్లు మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. మొదటి మూడు రోజులు రెండు పార్టీలు ఒకరినొకరు దూషించుకుంటూ సభను నడవకుండా చేశారని మండిపడ్డారు. మరో రోజు అపోజిషన్ లేకుండా తాము అడిగిన ప్రశ్నలపై చర్చ లేకుండా చేశారని ఏలేటి ధ్వజమెత్తారు.
22ఏ నిషేధిత జాబితాపై చర్చ పేరుతో సంబంధిత మంత్రి ఏకంగా నాలుగు గంటల పాటు మతిభ్రమించినట్లు మాట్లాడారే తప్ప 50 లక్షల మంది రైతులు, పేద వర్గాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఇంతకీ వారు ఏం చదువుకున్నారని చురకలంటించారు. ఒక సమస్యపై అందరూ ప్రశ్నిస్తారు.. అందరూ ఖండిస్తారని ఎద్దేవాచేశారు. నలుగురు సభ్యులు ఒక సమస్యపై ప్రశ్నిస్తే నలుగురు ఒకటేనని అంటారా? అంటూ మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎక్కువ సేపు మాట్లాడాం.., ఎక్కువ గంటలు మాట్లాడామని రికార్డు చెప్పుకోవడానికి మాత్రమే సభ కొనసాగిస్తున్నట్లుగా ఉందని ఏలేటి తెలిపారు.
22ఏ అంశంలో అధికారులు తప్పు చేశారని మంత్రి చెబుతున్నారని, ఆ తప్పు చేసినవారెవరో చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. తప్పులు చేసిన అధికారులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. సభలో బీజేపీ బాధ్యతాయుతంగా అవినీతి, భూ అక్రమాలపై గళమెత్తుతుంటే మంత్రులు మైకులు కట్ చేయిస్తూ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 22ఏ సెక్షన్లను కోర్టు నిర్ణయించిందని మంత్రి చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని, చట్టాలు చేసేది చట్టసభలు, జీవోలు ఇచ్చేది ప్రభుత్వమే తప్ప కోర్టులు కావని స్పష్టం చేశారు.
Also read: దర్గా దర్శనం పేరుతో.. భర్త హత్యకు భారీ స్కెచ్చేసి లేపేసిన భార్య!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని, 13 వేల లావాదేవీల ద్వారా దాదాపు 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని మంత్రులే సభలో అంగీకరించిన వీడియో రికార్డులను మీడియా ముందు ప్రదర్శించారని ఏలేటి వివరించారు. ఇంత భారీ కుంభకోణం జరిగిందని తెలిసినా ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. రిజిస్ట్రేషన్ అనేది టైటిల్ డీడ్ కాదని, తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా ఆడిట్ నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదని, గతంలో వేసిన సిట్ కాకుండా కొత్తగా వేసిన సెట్ కేవలం సెట్టింగ్‌లు చేసుకునేందుకేనా అని ప్రశ్నించారు. ఈ మొత్తం భూ బాగోతంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అనే పేరుతో హైదరాబాద్ పరిసరాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కాజేసేందుకు కొత్త దందా మొదలుపెట్టారని ఏలేటి ఆరోపించారు.
పేదల నుంచి ముందే బాండ్ పేపర్లు, నోటరీలు రాయించుకుని, తర్వాత వారికే ఫ్రీహోల్డ్ కల్పిస్తున్నట్లు చట్టాలు తెచ్చి రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులను తమ పేర్ల మీద మార్చుకునే పథకం రచిస్తున్నారని విమర్శించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్ కు చెందిన 333 ఎకరాల విలువైన భూమి ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు రూ.33 వేల కోట్ల విలువైన ఈ భూములను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని, ప్రభుత్వ పెద్దలకు ఇందులో 30 శాతం వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినట్లు తేలినా బాధ్యులైన అధికారులపై పీడీ యాక్ట్ పెట్టడం గానీ, సస్పెండ్ చేయడం గానీ ఎందుకు చేయలేదని ఏలేటి నిలదీశారు.
Also read: తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ
హైడ్రా పేరిట ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం అమలు చేస్తోందని ఆయన మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మూసీ నదికి 100 మీటర్ల దూరంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల చిన్న ఇళ్లను రాత్రికి రాత్రే బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ప్రభుత్వం, మూసీ నది మధ్యలోనే మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన నోటీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ప్రజాప్రతినిధుల భూవ్యవహారాలు, అక్రమ నిర్మాణాలపై అధికారులు మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు సంబంధిత మంత్రికి ఉన్న వ్యాపార ప్రయోజనాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలపై నోటీసులు రావడం, ప్రభుత్వంలో ఉంటూనే రూ.1,400 కోట్ల కాంట్రాక్టులను రివైజ్డ్ ఎస్టిమేషన్ల పేరుతో రూ.4,000 కోట్లకు పెంచుకోవడం ముమ్మాటికీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్విడ్-ప్రో-కో కాదా అని సూటిగా ప్రశ్నించారు.
హరీష్ రావు.. మామది తప్పుడు డాక్యుమెంట్ అయితే.. వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అలా చేయకుండా బ్లాక్ మెయిల్ కు ప్లాన్ చేశారా? అని అనుమానం వ్యక్తంచేశారు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే చూస్తూ ఊరుకోబోమని, తమ వద్ద 200కు పైగా పక్కా ఆధారాలతో కూడిన కేసు స్టడీలు ఉన్నాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న ఈ దోపిడీ నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామన్నారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను, గవర్నర్‌ను కలుస్తామని, అవసరమైతే రాజ్యాంగ పుస్తకం చేతబట్టి తిరిగే రాహుల్ గాంధీ నివాసం ముందే ఢిల్లీలో ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని దేశవ్యాప్తంగా ఎండగడతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Also read: మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్!