Telangana Youth: స్వేచ్ఛ బ్యూరో: ‘అన్నా…నాకు రాజకీయాలు అంటే ఇంట్రస్ట్ .. జనం కోసం పని చేయాలనే ఆశ కూడా ఉంది. కానీ ఏ జెండా పట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది? ఏ పార్టీలోకి వెళ్తే ప్రజాదరణతో పాటు భరోసా ఉంటుంది?’ అంటూ ఇప్పుడు యువత ఆరా తీస్తున్నది.గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని యువత నోట వినబడుతున్న ప్రధాన చర్చ ఇదే.రాజకీయాల్లోకి వచ్చి తమ ఉనికిని చాటుకోవాలని, సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్న నేటి తరం యువత ఇప్పుడు తీవ్రమైన రాజకీయ అన్వేషణలో పడింది. గతంలో లాగా కేవలం కుటుంబ నేపథ్యo చూసి జెండా పట్టుకునే కాలం పోయింది. పక్కా ప్రాక్టికల్ లెక్కలతో యువత తమ రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది.రాజకీయ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైందని భావిస్తున్న యూత్.. ముందస్తుగా అన్ని కోణాల్లోఆలోచిస్తోంది.నియోజకవర్గాల్లో పట్టున్న సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు క్షేత్రస్థాయి వ్యూహకర్తలతో రహస్యంగా, బహిరంగంగా సంప్రదింపులు జరుపుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుందా?
భవిష్యత్తుపై అంచనాలు చెక్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? ప్రతిపక్షాల బలం ఎంత? ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి?” అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. మరో వైపు ఇక తమ సొంత గ్రామం, నియోజకవర్గంలో తమకున్న ఇమేజ్ ఎంత? ఏ పార్టీ తరఫున నిలబడితే జనం ఆదరిస్తారు? అనే విషయాలపై సొంతంగా ప్రైవేట్ సర్వేలు కూడా చేయించుకుంటున్నారంటే యువత ఏ స్థాయిలో కసరత్తు చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
పండుగలు, విందులు… ‘పొలిటికల్ మైలేజ్’ కోసం ఆరాటం..
గ్రామాల్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని రాజకీయ మైలేజ్ కోసం మార్చుకునేందుకు యువ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఊరిలో జరిగే జాతరలు, గణేష్ నవరాత్రులు, పండుగ ఉత్సవాలకు సొంత ఖర్చులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అన్నదానాలు, క్రీడా పోటీలు నిర్వహించడం పరిపాటిగా మారింది. యువతను, స్థానిక ప్రభావిత వ్యక్తులను ఆకట్టుకోవడానికి విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చిన్న శుభకార్యానికి హాజరవుతూ “నేనున్నా” అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా హంగామా చేస్తున్నారు.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ, ప్రజా సమస్యలపై గళం విప్పుతూ రీల్స్, పోస్టులతో ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కాంగ్రెస్ సర్కార్‌పై అధ్యయనం.. ప్రతిపక్షాల వ్యూహాలు..
ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల అమలు తీరు, ప్రజల్లో ఉన్న ఆదరణపై యువత నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్తులో మళ్లీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, ప్రజాపోరాటాలు, ఆయా పార్టీల బలాబలాలను తూకం వేస్తున్నారు.ఏదేమైనా, రాజకీయాలను కేవలం ఒక వేదికగా కాకుండా, ఒక పక్కా కెరీర్‌గా, ప్రజాసేవ సాధనంగా మలుచుకోవాలని భావిస్తున్న నేటి యువత అడుగులు ఊళ్లలో కొత్త రాజకీయ సమీకరణాలకుదారితీస్తున్నాయి.”తొందరపడి ఒక కోవలోకి వెళ్లేకంటే… సరైన సమయంలో, సరిగ్గా ల్యాండ్ అవ్వాలి” అనే ధోరణితో ఉన్న యువ నాయకులు రాబోయే రోజుల్లో ఏ జెండా పడతారో, ఎలాంటి మార్పులు తెస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. వినాయక మండపం వద్ద ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య!