Hyderabad Police Alert for Dasara Vacation: బతుకమ్మ, దసరా పండుగలు వచ్చేశాయ్. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరుస సెలవులు ఉండడంతో కొంతమంది పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ తరుణంలో నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలకు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చిన ప్రజలతా వరుస సెలవులు ఉండడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు పయనం అవుతున్నారు. ఈ సమయంలో ఇదే అదునుగా భావించి కొంతమంది దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో లాక్ చేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీ చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
దసరా పండుగకు సొంతింటికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దన్నారు. బంగారం, వెండి, ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని వెల్లడించారు. ఒకవేళ కుదరని సమక్షంలో మీ వెంటనే తీసుకెళ్లాలని సూచించారు. సొంతూళ్లకు వెళ్లే సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండాలని పొరుగున లేదా పక్కింటి వాళ్లకు చెప్పాలన్నారు.
అలాగే సెలవుల్లో బయటకు వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచిదని పోలీసులు సూచించారు. ఇంటిని లాక్ చేసి సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. దీంతో పాటు మీకు సంబంధించిన వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. అలాగే వాహనాలను తప్పనిసరిగా లాక్ చేయాలని చెప్పారు.
ఒకవేళ కుదిరితే నమ్మకంగా ఉన్న వాచ్ మెన్లను మాత్రము సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలని సూచించారు. లేని సమక్షంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ ఏజెన్సీలను సంప్రదించి నియమించుకోవాలని సలహా ఇచ్చారు. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్ లైన్‌లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేలా ఉండాలన్నారు. అలాగే ఇంటి ఆవరణలో పేపర్స్, పాల ప్యాకెట్లు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వీటిని చూసి కూడా దొంగతనాలకు వస్తుంటారని చెప్పారు.
ఇంటి మెయిన్ డోర్‌కి తాళం వేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా లాక్ చేసినట్లు బయటి వ్యక్తులకు కనిపించకుండా కర్టెన్స్‌తో కవర్ చేయడం మంచిదన్నారు. కాలనీల్లో దొంగతనాలకు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసి, స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్ కనబడకుండా రహస్య ప్రదేశాల్లో పెట్టుకోవాలన్నారు. అల్మారా, కబోర్డ్స్‌కు తాళలను సీక్రెట్ ఏరియాల్లో పెట్టుకోవాలన్నారు. మీరు వెళ్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదన్నారు. ఇలా చేస్తే దొంగలకు సులువుగా లేరనే విషయం తెలుస్తుందన్నారు.
Also Read: డ్రామా షురూ చేసిన బీఆర్ఎస్ కట్ చేస్తే.. ఇలా దొరికిపోయారు
అలాగే కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా లేదా ఆ ప్రాంతాల్లో అనుమానాస్పందంగా కనిపిస్తే పోలీసులు సమాచారం అందించాలన్నారు. డయల్ 100కు ఫోన్ చేసి చెప్పిన వెంటనే పోలీసులు తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఇలా చేస్తే దొంగతనాలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.