Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాలను బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయా? రెండు వారాల్లో రెండు ఘోరమైన ప్రమాదాలు? ఇంతకీ ఈ పాపం ఎవరిది? కర్నూలు, చేవెళ్ల బస్సు భారీ ఘటనల్లో తప్పుంతా డ్రైవర్లదేనని అంటున్నారు. కారణాలు ఏమైనా.. గాల్లో కలిసిపోయేది ప్రయాణికుల ప్రాణాలే? చిన్న ప్రమాదాలు కూడా లెక్కిస్తే.. గడిచిన 12 రోజుల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్టేనని నిపుణుల అంచనా.
ఏపీ-తెలంగాణ రోడ్డు ప్రమాదాలు
అక్టోబరు 24న హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రయాణికులను గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. డీఎన్ఏ పరీక్షలు చేస్తేగానీ డెడ్‌బాడీలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన తర్వాత ఏపీ-కర్ణాటక-తెలంగాణ ప్రభుత్వాలు అలర్టయ్యాయి. రేపోమాపో సమావేశానికి రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడా తప్పంతా టిప్పర్ డ్రైవర్‌దేనని ఆర్టీసీ వర్గాలు తేల్చాయి. టిప్పర్ అతి వేగం కారణంగా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
నిన్న కర్నూలు.. నేడు రంగారెడ్డి జిల్లా
చివరకు ఆర్టీసీ, టిప్పర్ డ్రైవర్లు సైతం మృతి చెందారు. ఆర్టీసీ బస్సు కుడి వైపు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ లెక్కన ప్రమాదం ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో చేవెళ్లు, తాండూరు వాసులు ఎక్కువగా ఉన్నరు. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. దాదాపు టిప్పుర్ లారీలో 50 టన్నుల వరకు కంకర వేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం.
గడిచిన 12 రోజులుగా పరిశీలిస్తే ఏపీ, తెలంగాణల్లో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 100 మంది మరణించినట్టు నిపుణుల అంచనా. కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘటనల్లో దాదాపు 40 మంది వరకు మరణించారు. ఇవికాకుండా ప్రతీ రోజూ వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలను లెక్కిస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.
కేంద్ర రహదారి రవాణా శాఖ-2023 నివేదికల ప్రకారం.. దేశంలో ప్రతీ గంటకు 55 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ లెక్కన దాదాపు నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతోందన్నమాట. ప్రతీ ప్రమాదంలో 20 మంది మరణిస్తున్నారు. 2022 కంటే దేశంలో 2023లో ప్రమాదాలు పెరిగాయన్నది ఆ నివేదిక సారాంశం. దాదాపు 68 శాతం ప్రమాదాలు ట్రాఫిక్ ఉల్లంఘన, అతివేగం కారణంగానే సంభవించాయని తేల్చింది.
ALSO READ: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో పెరుగుతోన్న మృతుల సంఖ్య
ఇక మృతుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారు దాదాపు 66 శాతం మంది ఉన్నారు. ప్రమాదాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అంటే దాదాపు 68.5 శాతం కేవలం గ్రామాల్లో యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. పట్టణాల్లో 31 శాతంపైగానే ఉంది. ప్రతీ 100 ప్రమాదాల్లో 36 మంది మరణిస్తున్నారు. తెలంగాణలో ఆ సంఖ్య 33 గా ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో తెలంగాణలో 4.8 శాతం అన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తర్వాత ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నది భారత్‌లోనే.