
Telangana : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీజేపీ నేతలు మరోసారి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒక్కటేనని పదేపదే చెబుతున్నారు. పాదయాత్ర తర్వాత ప్రజల్లో రేవంత్ కు పెరిగిన ఇమేజ్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకే పడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఇటీవల ఈటల ఆరోపించారు. ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అయితే రేవంత్ ఆలయం వద్దకు వెళ్లి ప్రమాణం చేసినా.. ఈటల మాత్రం రాలేదు.
గర్భగుడిలో నిలబడి ఒట్టేసి.. కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఈటల తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతానని రేవంత్ తేల్చి చెప్పారు. ఈటలలా లొంగిపోయిన వ్యక్తిని కాదన్నారు. ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఈ క్రమంలో రేవంత్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
రేవంత్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన వ్యవహారంపై ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. తాను చేసిన ఆరోపణల్లో రేవంత్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదన్నారు. తాను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశానని ఈటల చెప్పుకొచ్చారు. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరన్నారు. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిది కాదని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని ఈటల మరోసారి ఆరోపించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై తెలంగాణ కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ నేతలు బాధ పడ్డారని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకుందని ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్నారని తాము అనడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.
బీజేపీ నేతలు మైండ్ గేమ్ కు తెరలేపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యూహం ఫలిస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని కాషాయ నేతలు భావిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలను ప్రజలు నమ్మేస్తారా?