Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే దరఖాస్తు దారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సిబిల్ స్కోర్ రూపంలో కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో తాము రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగ్గొట్టినట్టు తేలితే అప్లికేషన్లను పెండింగ్‌లో పడడం ఖాయమని బెంబేలెత్తుతున్నారు నిరుద్యోగులు.
ఈ ఏడాది 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి సిబిల్ స్కోర్ కీలకంగా మారింది. వచ్చిన దరఖాస్తులను రేపో మాపో బ్యాంకు అధికారుల తనిఖీ కోసం పంపినట్టు సమాచారం.
కీలకంగా సిబిల్ స్కోర్?
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారి అప్లికేషన్లు పక్కన బెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో వారంతా వ్యక్తిగత, వ్యవసాయ, గృహ, వాహన రుణాలు తీసుకుని తిరిగి చెల్లించనివారు. వారంతా అనర్హులుగా తేలే అవకాశం ఉంది.
యువ వికాసం స్కీమ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షలు 25 వేల అప్లికేషన్లు వచ్చాయి. అందులో అత్యధికంగా బీసీల నుంచి 5 లక్షల పైచిలుకు అప్లికేషన్లు ఉన్నాయి. ఇక ఎస్సీల నుంచి 2 లక్షల 95 వేలు, ఎస్టీల నుంచి లక్షా 39 వేలు, ఈ బీసీల నుంచి 23 వేలు ఉన్నాయి. ఇక మైనారిటీల నుంచి లక్షా 7 వేలు, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 2 వేలు పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.
ALSO READ: చీలిన ఆర్టీసీ సంఘాలు.. సీఎం రేవంత్ సూచన వెనుక
వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా సంబంధిత ఆఫీసర్లు 70 శాతం పరిశీలించారని అధికారుల మాట. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంకు అధికారులు పరిశీలించనున్నారు. ఆ తర్వాత అర్హులను ఎంపిక చేయనున్నారు. అర్హుల జాబితాను మే నెల చివరి నాటికి మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లనున్నాయి. తుది జాబితాను రెడీ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు.
వారంలో బ్యాంకుల వద్దకు
జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి ఈ స్కీమ్‌ను అమలు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. పథకాన్ని ఐదు కేటగిరీలుగా విభజించి యూనిట్లను మంజూరు చేస్తుంది. బ్యాంకు రుణాలతో పాటు కొంత సబ్సిడీ లబ్దిదారులకు రానుంది.
ఇక సిబిల్ స్కోర్ విషయానికి వద్దాం. రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి 100 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. అవి చెల్లిస్తే సిబిల్ స్కోర్ చెక్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని చెబుతున్నారు.
బ్యాంకులు నుంచి సమాచారం వస్తే స్పందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. దీనిపై ఫీజు మినహాయింపు ఇచ్చేలా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్‌లో కోరాలని డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు.