E-Paper

విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా.. రైతుకు రేవంత్ సర్కార్ ‘సమగ్ర’ భరోసా!

విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా.. రైతుకు రేవంత్ సర్కార్ ‘సమగ్ర’ భరోసా!
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను అదేశించారు. పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీ ఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో వ్యవసాయంపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై చర్చించారు. రైతులు ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్‌ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని అదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్‌ సప్లయిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్లానింగ్‌ విభాగం కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు.

కార్యచరణ సిద్ధం చేయాలని సూచన

Advertisement

విత్తనాల పంపిణీ మొదలు పంట వేసినప్పటి నుంచే అన్ని గ్రామాల్లో రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు, పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుందని, ఏ రైతు ఏ పంట వేశాడు.. ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు కచ్చితంగా క్షేత్ర స్థాయి పరిశీలనతో నమోదు చేయాలనిసూచించారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్‌ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశాలు

Advertisement

సన్న వడ్లు పండించే రైతులకు బోనస్‌ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాలని చెప్పారు. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్‌ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.

Also Read:  తెలంగాణ అటవీ శాఖ ‘బాస్’ ఎవరు? పీసీసీఎఫ్ రేసులో ముగ్గురు సీనియర్లు!

సాంకేతిక వినియోగం.. సీఎం సూచన

వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకోవాలని సీఎం సూచించారు. ఏఐ ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీని నోడల్‌ ఏజెన్సీగా పెట్టుకొని విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్‌ సప్లయిస్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాలు అధ్యయనం చేయాలని, రైతులకు ఉపయోగంగా ఉంటే మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు.ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్‌ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. యాప్‌ ద్వారా రైతులు బుక్‌ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు.

మంత్రి తుమ్మల కు సీఎం సూచన

ఖరీఫ్ సీజన్ కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల కు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలని సూచించారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ కి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మార్క్‌ఫెడ్‌ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాపారులకు తలోగ్గకుండా ఈ సారి ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్క జొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని సీఎం పేర్కొన్నారు.

అధికారులకు ఆదేశాలు

గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మిన పరిస్థితి ఉందని.. ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభలదిశలో నడిపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ డైరీని మరింత బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. సకాలంలో పాల రైతులకు చెల్లింపులు జరపాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి , వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related News

లేట్ చేస్తే ఫైన్లే.. కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సైబరాబాద్ కమిషనర్!

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దం.. విపక్షాలకు మంత్రి అడ్లూరి ఓపెన్ ఛాలెంజ్!

కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్.. హైడ్రాకు ఆ అధికారం ఎవరిచ్చారు?

తెలంగాణ అటవీ శాఖ ‘బాస్’ ఎవరు? పీసీసీఎఫ్ రేసులో ముగ్గురు సీనియర్లు!

రైతన్న మెడపై కాంగ్రెస్ కత్తి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

అధికారులు మాట వినడం లేదు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధులు విడుదల చేయండి.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ!

×