PCCF Race: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అటవీ శాఖ అత్యున్నత పదవి ..పిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్)ఎంపిక ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పీసీసీఎఫ్ సువర్ణ పదవీకాలం ఈ నెల ఆఖరుతో ముగియనుండటంతో, తదుపరి అటవీబాస్ ఎవరనే దానిపై సచివాలయం నుంచి అరణ్య భవన్ వరకు ముమ్మర చర్చ సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పీసీసీఎఫ్ పీఠం కోసం ముగ్గురు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారుల మధ్య ‘త్రిముఖ పోటీ’ నెలకొనడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పదవి రేసులో సీనియర్ అధికారులు
కొత్త పీసీసీఎఫ్ నియామకానికి సంబంధించి అర్హులైన అధికారుల సేవా వివరాలు, సీనియారిటీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ లోపే తమకు అనుకూలమైన స్థానం కోసం అభ్యర్థులు తమదైన శైలిలో పైరవీలు షురూ చేసినట్లు సమాచారం. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు బ్యూరోక్రసీలో పట్టున్న నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పీసీసీఎఫ్ పదవి రేసులో సీనియర్ అధికారులు వినయ్ కుమార్, రత్నాకర్ జౌహారీ, సునీత ఎం భగవత్ ఉన్నారు. ఈ ముగ్గురు అధికారులు 16లెవల్ లో ఉన్నారు.
క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన
వినయ్ కుమార్ 1992 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. శాఖలో సుదీర్ఘ అనుభవం, క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం ఆయన పీసీసీఎఫ్ (సీడబ్ల్యూఎల్డబ్ల్యూ) విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీ సంరక్షణపై పట్టు ఉన్న అధికారిగాపేరుంది. రత్నాకర్ జౌహారీ1994 బ్యాక్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. పీసీసీఎఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కీలక బాధ్యతల్లో పనిచేసిన అనుభవం,పరిపాలనా దక్షత, వివాదరహితుడిగా పేరుండటం కలిసివచ్చే అంశం.పరిపాలనా విభాగంలో , కేంద్ర ప్రభుత్వ లైజనింగ్‌లో ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
Also Read: రైతన్న మెడపై కాంగ్రెస్ కత్తి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం
సునీత ఎం భగవత్ ప్రస్తుతం టీజీఎఫ్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె 1996 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. సమర్థురాలైన మహిళా అధికారి. పర్యావరణ, అటవీ విభాగాల్లో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ రెండురంగాల అనుసంధానంలో కీలక పాత్ర పోషించారు. ఒకవేళ అమెకు అవకాశం దక్కితే అటవీ శాఖలో మరో మహిళా అధికారికి అత్యున్నత పదవి దక్కినట్లవుతుంది.
డిల్లీ, హైదరాబాద్ వేదికలుగా పైరవీలు షురూ
ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకునేందుకు అధికారులు తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారనే ప్రచారంజరుగుతుంది. తమకు అనుకూలమైన సమీకరణాలను చక్కబెట్టుకునేందుకు అధికారులు డిల్లీ, హైదరాబాద్ వేదికలుగా గట్టిగానే పైరవీలు షురూ చేసినట్లు సమాచారం. పాలక పక్షంలోని ముఖ్య నేతల ద్వారా సీఎంఓ వద్ద మార్కులు కొట్టేసేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అధికారుల బయోడేటాలతో కూడిన సీనియారిటీ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం నుంచి స్క్రీనింగ్ కమిటీ క్లియరెన్స్ రాగానే, రాష్ట్ర ప్రభుత్వం తుది పేరును ఖరారు చేయనుంది.
క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ
సాధారణంగా పీసీసీఎఫ్ నియామకం అనేది సీనియారిటీ ఆధారంగా పెద్దగా హడావుడి లేకుండా జరిగిపోతుంటుంది. కానీ, ఈసారి ముగ్గురు అధికారులు సమవుజ్జీలుగా ఉండటం, ముగ్గురికీ ప్రభుత్వ పెద్దల వద్ద మంచి గుర్తింపు ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది.దీంతో అటవీ శాఖ ఉద్యోగుల్లో, క్షేత్రస్థాయి సిబ్బందిలో తీవ్ర చర్చ నడుస్తోంది.
అటవీ బాస్ ఎవరో..?
గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీఎఫ్ పదవికి ఇంతటి ప్రాధాన్యత దక్కడం వెనుక రాజకీయ, పరిపాలనాపరమైన కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో అటవీ భూముల ఆక్రమణల నిరోధం, పోడు భూముల వివాదాల పరిష్కారం, కేంద్ర నిధుల సద్వినియోగం వంటి సవాళ్లు ఉన్నాయి. వీటన్నింటినీ సమర్థవంతంగా డీల్ చేయగల నమ్మకమైన అధికారి కోసం ప్రభుత్వం కూడా యోచిస్తోంది. సమర్థతకు పట్టం కడతారా? లేక సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తారా? అన్నది మరో వారం, పది రోజుల్లో తేలనుంది. రాష్ట్ర అటవీ రక్షణ, పర్యావరణ సమతుల్యత వంటి కీలక బాధ్యతలను మోయబోయే ఆ ‘అటవీ బాస్’ ఎవరో తెలియాలంటే ఈ నెల ఆఖరు వరకు వేచి చూడాల్సిందే!