CM Revanth Reddy: కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్’లో భాగంగా తమకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం తుంగభద్ర కింద కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామన్న రేవంత్.. మిగిలిన 10 టీఎంసీల నీరు అందడం లేదని చెప్పారు.
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్.పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో కలిసి రేవంత్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. ఆర్డీఎస్ కింద పాలమూరుకు కేటాయించిన 15.9 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించగలుగుతున్నామని అన్నారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యల కారణంగా కేటాయించిన నీటిలో మరో 10 టీఎంసీల నీరు అందక గద్వాల్, అలంపూర్ ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు నష్టం జరుగుతుందోని చెప్పారు.
ఇప్పటికే దీనిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు రేవంత్ రెడ్డి సభలో పేర్కొన్నారు. ఈ సమస్యకు సీఆర్ పాటిల్ శాశ్వత పరిష్కారం చూపిస్తారని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు రేవంత్ అన్నారు. ‘మూడు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలకు పాటిల్ శాశ్వతంగా పరిష్కరిస్తారని నమ్ముతున్నా. నీటి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల పొలాలను తడపాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది’ అని వివరించారు.
Also Read: రేవంత్ ‘డైనమిక్ లీడర్’.. తెలంగాణ హక్కులపై రాజీపడరు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
తుంగభద్ర 33 గేట్ల పునరుద్దరణ.. కర్నూల్, అనంతపురం, పాలమూరు జిల్లాలకు చెందిన లక్షలాది రైతుల సమస్యకు పరిష్కారం చూపుతుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా, తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు.. చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారతాయని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం కృష్ణా, గోదావరి, తుంగభద్ర జలాల్లో అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల రైతుల కోసం మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాం నవాబు కలిసి తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా రైతన్నల కోసం అడుగులు ముందుకు వేస్తున్నట్లు రేవంత్ అన్నారు. మూడు రాష్ట్రాల సమస్యలను కేంద్రమంత్రికి వివరించినట్లు రేవంత్ తెలిపారు.
Also Read: ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్