Rajamouli Europe: లూమియర్ బ్రదర్స్‌భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై మరోసారి ఘనంగా చాటిచెప్పేందుకు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సిద్ధమవుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చారిత్రక విజయాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, జూన్ 26 నుంచి జూలై 4 వరకు ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రత్యేక సినీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. తాజాగా విడుదలైన అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఆయన కెరీర్‌లోని పలు చిత్రాలకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంతేకాదు, అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ సెషన్లు, మాస్టర్‌క్లాస్‌లు, మీడియా ఇంటరాక్షన్లు కూడా ఈ టూర్‌లో భాగం కానున్నాయి.
ఈ పర్యటన జూన్ 26న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ సినీ సంస్థ సినెమాథెక్ ఫ్రాన్సైస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక ప్రదర్శనతో ప్రారంభం కానుంది. 2022లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా, ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు గెలిచి భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకువచ్చింది. ఆ విజయగాథను మరోసారి ఫ్రెంచ్ ప్రేక్షకుల ముందుంచేందుకు ఈ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
ఇక జూన్ 27న అదే వేదికపై ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలకు ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. మధ్యాహ్నం రాజమౌళి పాల్గొనే మాస్టర్‌క్లాస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారతీయ పురాణాలు, ఫోక్ ఎలిమెంట్స్, భారీ విజువల్ కథనాలను ప్రపంచ ప్రేక్షకులకు ఎలా అందించాలో అనే అంశాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ భారతీయ సినిమా చరిత్రలో 2,400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా యుగానికి నాంది పలికిన చిత్రంగా గుర్తింపు పొందింది.
ఇక పొతే జూన్ 28న ‘మర్యాద రామన్న’ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శన, అనంతరం ఇంటర్వ్యూ, అభిమానులతో సంతకాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ‘ఈగ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఒక చిన్న ఈగను హీరోగా నిలబెట్టి ప్రపంచ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రాజమౌళి సృజనాత్మకతను గుర్తు చేసే కార్యక్రమంగా ఇది నిలవనుంది. 2012లో విడుదలైన ‘ఈగ’ తెలుగు సినిమా క్రియేటివిటీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ఇక జూన్ 29న పారిస్‌లోని యూజీసీ లెస్ హాల్స్‌లో మరోసారి ‘ఈగ’ ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. జూన్ 30న గ్రాండ్ రెక్స్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం, అనంతరం మాస్టర్‌క్లాస్, రాత్రి ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. యూరప్‌లోని సినీ విద్యార్థులు, ఫిల్మ్ మేకర్లు ఈ కార్యక్రమంపై భారీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
జూలై 1న ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో లూమియర్ టూర్ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి అభిమానులను కలవనున్నారు. అక్కడ కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక ప్రదర్శన ఉండనుంది. ప్రపంచ సినిమా చరిత్రలో లూమియర్ బ్రదర్స్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటే, ఆ వేదికపై రాజమౌళికి లభిస్తున్న గౌరవం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా భావిస్తున్నారు.
ఇక జూలై 3న స్విట్జర్లాండ్‌లోని న్యూషాటెల్ నగరంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శనతో పాటు NIFF అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. న్యూషాటెల్ ఇంటర్నేషనల్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడ రాజమౌళి హాజరు కావడం అంతర్జాతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూలై 4న న్యూషాటెల్‌లో ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌తో ఈ టూర్ ముగియనుంది. కథ చెప్పే విధానం, భారీ విజువల్ స్కేల్‌ను నిర్మించే పద్ధతులు, భారతీయ భావోద్వేగాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు కనెక్ట్ చేసే రీతిపై ఆయన వివరంగా మాట్లాడే అవకాశముంది. ఈ సెషన్‌కు ఇప్పటికే భారీ స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ టూర్‌లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ప్రతి స్క్రీనింగ్ సందర్భంగా రాజమౌళి తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ ప్రదర్శించనున్నట్లు పోస్టర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసి పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ‘మహాభారతం’పై తన కలల ప్రాజెక్ట్ గురించి గతంలో పలుమార్లు ప్రస్తావించిన రాజమౌళి, భవిష్యత్ ప్రణాళికలపై కూడా కొన్ని సూచనలు ఇవ్వొచ్చనే చర్చ సాగుతోంది.
ఒక తెలుగు దర్శకుడి సినీ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ ఫిల్మ్ స్కూల్స్‌లో అధ్యయన అంశంగా మారిన సమయంలో, ఫ్రాన్స్-స్విట్జర్లాండ్ టూర్ కేవలం స్క్రీనింగ్‌ల పరంపర మాత్రమే కాదు. భారతీయ కథల శక్తిని, తెలుగు సినిమా సామర్థ్యాన్ని,మొత్తానికి వేదికపై రాజమౌళి సాధించిన అరుదైన స్థాయిని మరోసారి ప్రపంచానికి గుర్తుచేసే వేడుకగా ఇది నిలవబోతోందన్న మాట.