Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు ముగుస్తున్న నేపథ్యంలో ప్రజా పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ ప్రతిష్ట ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన (పల్స్) ఏ విధంగా ఉందనే అంశంపై అధ్యయనం చేసేందుకు స్వయంగా సీఎం టీమ్ రంగంలోకి దిగింది.తొలుత మంత్రుల నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు.ఆ తర్వాత మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వేను పూర్తి చేయనున్నారు. పరిపాలనపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సర్వే ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నారు.
వివిధ అంశాలపై నివేదిక తయారు
ప్రభుత్వ గ్యారెంటీలు,సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి? స్థానిక ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు మంత్రులు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు?నియోజకవర్గాల్లో పార్టీ పట్టు ఎలా ఉందనే అంశాలపై సర్వే అధారంగా నివేదికలు తయారు కానున్నాయి. మంత్రుల నియోజకవర్గాల సర్వే ముగిసిన తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాల చేతిలో ఉన్న సెగ్మెంట్లలోనూ ప్రజాభిప్రాయాన్ని ఈ టీమ్స్ సేకరించనున్నాయి. కేవలం నివేదికలు తీసుకోవడమే కాకుండా, ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ అసంతృప్తి వ్యూహాలు నడుస్తున్నాయి? అనే విషయాలను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత రహస్యంగా క్రోడీకరిస్తున్నారు.
Also Read: ఆర్‌ఎస్‌పీ ప్రాణాలకే ప్రమాదమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
సర్వే ఎందుకంటే..?
రెండున్నర ఏళ్ల పాలన తర్వాత ప్రభుత్వంపై యాంటీ-ఇంకంబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేకత) రాకుండా ముందుగానే అప్రమత్తమయ్యేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.క్షేత్రస్థాయిలో హామీల అమలులో ఉన్న అడ్డంకులను తెలుసుకోవడవంతో పాటు ప్రజల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వేలు చేపిస్తున్నారు. అంతేగాక ప్రజల్లో పట్టు కోల్పోతున్న ప్రజాప్రతినిధులను హెచ్చరించి, వారి గ్రాఫ్ పెంచుకునేలా దిశానిర్దేశం చేసేందుకు కూడా ఉపయోగపడనున్నది.మరోవైపు ఈ సర్వేల ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి, కాంగ్రెస్ పార్టీ పరంగా , ప్రభుత్వ అభివృద్ధి పరంగా వెనుకబడిన జిల్లాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిల్టర్ చేయనుంది.వెనకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా సీఎం చర్యలు తీసుకోనున్నారు. అంతేగాక సదరు జిల్లాల ఇన్-ఛార్జ్ మంత్రులను అలర్ట్ చేయడం, క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేందుకు కూడా సీఎం తన కార్యచరణను సిద్ధం చేయనున్నారు.
Also Read: పాస్‌పోర్ట్ ఉంటే భారతీయుడైనట్లేనా?.. ఒవైసీకి కిషన్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్!
స్వయంగా రంగంలోకి సీఎం రేవంత్..
మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల మూడ్‌ను ఇప్పటి నుంచే సెట్ చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకే థర్డ్ పార్టీ ,ఇంటెలిజెన్స్ సర్వేలను పక్కన పెట్టి, తన సొంత నమ్మకస్థులతో కూడిన ‘సీఎం టీమ్’ నివేదికలపైనే రేవంత్ రెడ్డి ఎక్కువగా ఆధారపడుతున్నారు. పనితీరు మార్చుకోని ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు కూడా వెనుకాడబోరని గాంధీ భవన్ వర్గాల టాక్.రెండున్నరేళ్ల కాంగ్రెస్ మార్క్ పాలనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరియు వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగడానికి రేవంత్ రెడ్డి వేసిన ఈ ‘సర్వే వ్యూహం’ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే సునీల్ టీంతో సర్వే..?
ప్రభుత్వం పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, నెరవేరని హామీలపై ప్రజల అభిప్రాయాలను ఇప్పటికే సునీల్ కనుగోలు టీమ్ ద్వారా నమోదు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి పది జిల్లా ల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ని సునీల్ కనుగోలు కీలక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లా ల్లో బీఆర్ఎస్ ,మరికొన్ని జిల్లా ల్లో బీజేపీ కాంగ్రెస్ కు గట్టి ఫైట్ ఇవ్వనున్నట్లు అంచనా వేశారు. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ,బీఆర్ఎస్ లు మెరుగ్గా ఉన్నాయని సునీల్ రిపోర్ట్ లొ తేల్చి చెప్పారట దీంతో పోటీలొ మూడొ స్థానం లొ ఉన్న పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లించాలంటే ఏం చేయాలనేదాని పై ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారట.
బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు ,బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ కి షిఫ్ట్ కాకుండా ఉంటె కాంగ్రెస్ కు లాభం జరుగుతుందని సునీల్ టీం సూచించినట్లు గాంధీభవన్ వర్గాల్లో టాక్ . ఇక నుంచి ప్రతీ ఆరు నెలలకోసారి తమ టీమ్ సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుందని సునీల్ టీమ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేగాక పార్టీ సోషల్ మీడియా టీమ్ లను హ్యాండిల్ చేసేందుకు సునీల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.