BJP Demands: స్వేచ్ఛ బ్యూరో: తుంగభద్ర నదికి సంబంధించిన అంశంపై ముఖ్యంమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాట్లాడుతున్నారని, ముందుగా నీటి వాటాల విషయంపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నది గేట్ల రిపేర్ల వ్యవహారాన్ని బీజేపీ స్వాగతిస్తోందని, అయితే నీటి వాటాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
15.9టీఎంసీల లెక్క ఏంటి..?
కర్ణాటకలో ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్(35 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవల ప్రాజెక్ట్(20 టీఎంసీలు) వల్ల తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా దెబ్బతిని కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఏం మాట్లాడారో, రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీలు తెచ్చారో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్రాల మధ్య వివాదాల్లో మధ్యవర్తిగా ఉండి సమస్యలను పరిష్కరించడానికే ప్రయత్నిస్తోందని తెలిపారు.
రాబోయే రోజుల్లో పార్టీపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, రాబోయే రోజుల్లో పార్టీని అధికార దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాంచందర్ రావు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారని వెల్లడించారు. ఒక జాతీయ అధ్యక్షుడు మూడు రోజుల పూర్తి సమయాన్ని రాష్ట్రానికి కేటాయించడం తెలంగాణపై వారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని, గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు పర్యటించిన తరహాలోనే నితిన్ నబీన్ పర్యటన కూడా రాష్ట్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు.. హరీష్ రావు వ్యాఖ్యలపై కూనంనేని సాంబశివరావు ఫైర్!
10 జిల్లాలో నూతన పార్టీ కార్యలయాలు
నితిన్ నబీన్ ఈనెల 28న శంషాబాద్ చేరుకుంటారన్నారు. అదేరోజు రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమావేశంలో పాల్గొంటారని, అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని వివరించారు. రెండో రోజు ఉదయం వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాంక్లేవ్ లో పాల్గొని, అనంతరం వరంగల్ వెళ్లే మార్గంలో భువనగిరిలో ఘనస్వాగతం అందుకుంటారని తెలిపారు.
నితిన్ నబీన్ పర్యటన షెడ్యుల్
వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండ్స్ వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత, ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మూడో రోజు ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ (స్టేట్ వర్కింగ్ కమిటీ), ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగుపయనమవుతారని, ఈ పర్యటన పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉద్దేశించినదే తప్ప ఎన్నికలతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఓటు బ్యాంక్ రాజకీయాలు
ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టం అంశాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ కలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజంలో ధ్రువీకరణ తెచ్చేందుకు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. 2013 బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదని, 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారతీయుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.
ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టించడం తగదు
ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదు ప్రక్రియలో ఆధారాల కోసం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటి మాత్రమేనని, చట్టాలు చదువుకున్న బారిష్టర్ అయిన ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని హితవు పలికారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అనవసర భయభ్రాంతులు సృష్టించవద్దని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ వీరేందర్ గౌడ్, రాష్ట్ర ట్రెజరర్ దేవకి వాసుదేవరావు, రాష్ట్ర మీడియా ఇంచార్జ్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్, ఎంబీసి కార్పొరేషన్ మాజీ చైర్మన్, స్పోక్స్ పర్సన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.