Hyderabad Crime: అదొక రద్దీగా ఉండే ప్రాంతం. అంతేకాదు వీవీఐపీలు నివాసముండే ప్రదేశమది. కానీ అక్కడ దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అది కూడ ఎవరి ఇంట్లోనో అనుకుంటే పొరపాటే. ఏకంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గృహంలో. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు రంగంలోకి దిగి ఇప్పటికే ఆధారాలు కూడ సేకరించినట్లు సమాచారం.
దొంగలు కూడ సంక్రాంతి సెలవులు తీసుకున్నారో ఏమో కానీ, పండుగ రోజుల్లో కాస్త తమ చేతివాటం ప్రదర్శించలేదనే చెప్పవచ్చు. కానీ అలా సంక్రాంతి పండుగ హంగామా అయిపోయిందో లేదో, మళ్లీ డ్యూటీకి ఎక్కినట్లు ఉంది చోరులు. అందుకే కాబోలు ఒక్కొక్క చోరీ వెలుగులోకి వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ చోరీ జరగగా, పోలీసులు ఇప్పటికే వారిని పట్టేసినట్లేనన్న రేంజ్ లో ఆధారాలు దొరికాయని తెలుస్తోంది.
హైదరాబాద్ లోని ఫిలింనగర్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కుటుంబం నివాసం ఉంటోంది. ఈ ఇంట్లో దొంగలు ప్రవేశించి, రూ.1.5 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నది మాత్రం తెలియరాలేదు. కానీ చోరీ జరిగిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణా దేవి ఇటీవల ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్ లను పరిశీలించారు. ఆ తర్వాత ఇంట్లో పని చేసే వారిని కూడ విచారించినట్లు తెలుస్తోంది. అసలే మాజీ మంత్రి ఇంట్లో చోరీ జరగడంతో, పోలీసులు కూడ అప్రమత్తమయ్యారు.