Salvo Issue :
⦿ తప్పుడు సర్వే నెంబర్లు.. ఇష్టారీతిన కబ్జాలు
⦿ గుట్టుచప్పుడు కాకుండా బోర్డులకు నలుపు రంగు
⦿ స్వేచ్ఛ కథనాలతో పతనం మొదలైందా?
⦿ ఆర్ఆర్ ఎనర్జిటిక్స్ భూముల్లో సాల్వో కంపెనీ పాగా
⦿ ఇష్టం వచ్చినట్టు చుట్టుపక్కల భూముల కబ్జా
⦿ ఆఖరికి ప్రభుత్వ భూముల్ని సైతం వదలని వైనం
⦿ అసలు నిజాలన్నీ బయటపెట్టిన ‘స్వేచ్ఛ’
⦿ చైర్మన్ జయరాం రెడ్డి, డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి దందాలపై సంచలన కథనాలు
⦿ ‘స్వేచ్ఛ’ దెబ్బతో బోర్డులకు రంగులేస్తున్న జయరాం రెడ్డి
⦿ రంగులు పూస్తే కబ్జాలు కనిపించకుండా ఉంటాయా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఓఆర్ఆర్‌కి దగ్గరగా కీసర గుట్టల్లో ఉంటుంది ఈ సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ అండ్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ అనామక కంపెనీకి సింగరేణి మైనింగ్ వెలికి తీసేందుకు వాడే పేలుడు పదార్థాల స్లప్లై టెండర్స్ దక్కడంతో ఒక్కసారిగా ఈ కంపెనీ పేరు మార్మోగుతోంది. అసలు ఈ కంపెనీ ఏంటి? ఎలా పుట్టింది? ఎవరి చేతుల్లో ఉంది? ఇలా అనేక డౌట్స్‌తో ‘స్వేచ్ఛ’ స్టింగ్ ఆపరేషన్ చేయగా, బినామీ వ్యవహారాలు, భూ కబ్జాలు, బెదిరింపులు ఇలా చాలా బయటపడ్డాయి. చైర్మన్ జయరాం రెడ్డి సాగించిన లీలలు, రాజకీయ నేతలను మ్యానేజ్ చేసే తీరును అంతా బయటపెట్టింది ‘స్వేచ్ఛ’. ఒక సర్వే నెంబర్‌లో ఉంటూ, ఇంకో సర్వే నెంబర్ బోర్డులు ఏర్పాటు చేసి సాల్వో కంపెనీ చేస్తున్న మాయను జనం ముందు పెట్టింది. దీంతో సాల్వో కంపెనీ పతనం మొదలైందా? అనే చర్చ జరుగుతోంది.
గుట్టంతా బయటపెట్టిన ‘స్వేచ్ఛ’
కీసర రెవెన్యూ పరిధిలో ఆర్‌ఆర్ హై ఎనర్జిటిక్స్ లిమిటెడ్‌ను తమిళనాడుకు చెందిన కొందరు ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. రోజులు గడిచేకొద్దీ, సదరు కంపెనీలోని తమిళనాడుకు చెందిన డైరెక్టర్స్ వైదొలగడం, కొందరు చనిపోవడంతో 3వేల ఎకరాలకు పైగా ఉన్న భూములపై జయరాం రెడ్డి, వంగా రాజేశ్వర్ రెడ్డి కుటుంబాల కన్నుపడింది. ఆర్ఆర్ హై ఎనర్జిటిక్స్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో 3 వేల ఎకరాల్లో బాంబులు తయారు చేసేలా ప్లాన్ చేసుకుంది. తర్వాత సాల్వో ఎక్స్‌ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1985లో ఏర్పాటు చేసినట్లు చూపించుకున్నారు. అసలైన కంపెనీలో డైరెక్టర్స్ మారారు. ఇప్పుడంతా జయరాం రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి అంతా నడిపిస్తున్నారు. అయితే, 3175 ఎకరాల భూమిలో చాలావరకు దారి మళ్లింది. అదే భూమిని చూపించి అనుమతులు తీసుకున్న సాల్వో కంపెనీ, రోజుకు 100 టన్నుల నుంచి 120 టన్నుల వరకు అమోనియం నైట్రేట్ వాడుతోంది. ఇదంతా పనిచేస్తున్నది ఎక్కడ అంటే కీసర రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 918లోని ప్రభుత్వ భూమిలోనే. దీనిపై పక్కా ఆధారాలతో ‘స్వేచ్ఛ’ కథనాలు ప్రచురించింది.
స్వేచ్ఛ దెబ్బకు బోర్డులకు రంగులు
కీసర రెవెన్యూ పరిధిలోని 918 సర్వే నెంబర్‌లో సాల్వో కంపెనీ ఉంటుంది. కానీ, బోర్డుల్లో మాత్రం సర్వే నెంబర్ 786/ఏ అని చూపించారు. వంద ఎకరాల కబ్జాలో ఉన్న ఈ కంపెనీ గుట్టంతా ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. భూములనే కాకుండా 180 సర్వే నెంబర్‌లోని చెరువు కబ్జా గురించి ఆధారాలతో సహా ప్రచురించింది. దీంతో జయరాం రెడ్డి బాగోతాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో సాల్వో కంపెనీ బోర్డులకు నల్ల రంగు వేయిస్తున్నారు. సర్వే నెంబర్లు ఎవరికీ కనిపించకుండా చేస్తున్నారు.
గుట్టలన్నీ మాయం
రియల్ ఎస్టేట్ ముసుగులో సాల్వో కంపెనీ చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. అదిగో గుట్ట, ఇదిగో ప్లాట్ అంటూ ఇష్టారీతిన అమ్మకాలు జరిపింది. ఆర్ఆర్ హై ఎనర్జిటిక్స్‌కు చెందిన భూములు బినామీల పేర్లతో భారీగా బదిలీలు జరిగాయి. బాంబుల కంపెనీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ లాభాల కోసం మళ్లించారు. కంపెనీ డైరెక్టర్ వంగా రాజేశ్వర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నేతలకు దగ్గరగా ఉన్నాడు. కేటీఆర్, హరీష్ రావుల మనిషిగా ముద్ర వేసుకున్నాడు. దీంతో బినామీ భూముల అనుమానాలు ఉన్నాయి. అయితే, అదే భూమిని రెగ్యులరైజేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అన్నీ సైలెంట్‌గా జరిగిపోవాలన్న ఉద్దేశంతోనే బోర్డులకు రంగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.