BigTV English

Sharmila : ఆగిన చోట నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభం… ముగింపు ఎప్పుడంటే?

Sharmila : ఆగిన చోట నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభం… ముగింపు ఎప్పుడంటే?

Sharmila : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, హైదరాబాద్ లో అరెస్ట్ ఘటనల తర్వాత వైఎస్ షర్మిల మరింత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తగ్గదేలే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తానని ప్రకటించారు. ఏ వ్యూహంతో ముందుకెళ్లేది స్పష్టత కూడా ఇచ్చేశారు. టీఆర్ఎస్ తో సై అంటే సై అనే ధోరణిలోనే షర్మిల ఉన్నారు.


ఇప్పటికే గవర్నర్ తమిళసైను కలిసి తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి షర్మిల ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పోలీసులను పార్టీ కార్యకర్తలుగా టీఆర్‌ఎస్‌ వాడుకుంటోందని విమర్శించారు. తాను ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని డీజీపీకి ఫిర్యాదు చేశానని షర్మిల తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం టీఆర్‌ఎస్‌ కే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రజల దృష్టిలో చులకన కావొద్దని సూచించారు. డీజీపీ కలిసి తర్వాత అటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇటు పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపట్టారు.

టీఆర్ఎస్ పై అదే ఎటాక్
ఒకప్పుడు ఉదమ్యపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌.. నేడు గుండాల పార్టీగా మారిందని షర్మిల విమర్శించారు. ఇది తాలిబన్‌ల రాజ్యం అనడానికి ఎలాంటి సంకోచం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తాలిబన్‌లు కాదా? కేసీఆర్‌ తాలిబన్ల అధ్యక్షుడు కాదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని షర్మిల తేల్చి చెప్పారు. ఇలా గతంలో కంటే మరింత ఘాటుగా షర్మిల విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలతో తాడోపేడో తేల్చుకోవాలనే ధోరణిలోనే షర్మిల ముందుకెళుతున్నారని తాజాగా చేసిన విమర్శలు చెబుతున్నాయి.


అధికారమే లక్ష్యం
తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని ఎవరూ అడ్డుకోలేరని షర్మిల స్పష్టం చేశారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన తీసుకొచ్చేంత వరకు ఆగేది లేదన్నారు. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇకపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన విమర్శల దాడిని మరింత పెంచేందుకు షర్మిల సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది.

ఆగిన చోటే నుంచే..
మరోవైపు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు , పాదయాత్ర కొనసాగింపుపై చర్చించారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి గ్రామం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత అదనపు డీజీ జితేందర్ ను షర్మిల కలిశారు. పాదయాత్రకు సంబంధించిన వివరాలను డీజీకి వివరించారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. పాదయాత్రపై కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పోలీసులకు అందించారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిన వాగ్దానాలు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 3,525 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశానన్నారు. డిసెంబర్ 4 నుంచి 14 వరకు పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు. మరి ఈసారి పాదయాత్రలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×