Control Room: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సంబంధిత, అత్యవసర సేవలపై త్వరలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇప్పటి వరకు పలు సార్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమీక్షల్లో శానిటేషన్, దోమల నివారణ, ఫుడ్ సేఫ్టీ వంటి ఇతర అత్యవసర సేవలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, అవసరమైతే ఎంతటి వారినైనా సస్పెన్షన్ చేస్తామని సీఎం అల్టిమేటం జారీ చేయటంతో మూడు కార్పొరేషన్ల అధికారులు అత్యవసర సేవలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్లు డైలీ తెల్లవారుఝమున పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ కోసం నిర్వహించే ఫాగింగ్ వంటి పనులను క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్లు ఆర్.వి. కర్ణన్, జి. సృజన నేరుగా ఫీల్డు లెవెలో లోపాలను గుర్తించి, సిబ్బందిని హెచ్చరిస్తున్న సందర్భాలున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం మున్సిపల్ శాఖపై సీఎం వద్ద జరిగిన రివ్యూ మీటింగ్ లో కోర్ అర్బన్ రీజియన్ లో ప్రజలకు అందిస్తున్న హెల్త్ పరమైన అత్యవసర సేవలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టి, జవాబుదారి తనాన్ని అలవర్చుకునేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించటంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలైన పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగంలో దోమల నివారణ, వెటర్నరీ విభాగంలో కుక్కల నియంత్రణతో పాటు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ వంటి ప్రక్రియలు మరింత పటిష్టంగా జరిగేందుకు వీలుగా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయి లోపాలను సరి చేసేందుకు వీలుగా ప్రత్యేక పర్యవేక్షణ కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
దోమల నివారణకు సంబంధించి చేస్తున్న ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లకు సంబంధించి ప్రతి రోజు వేలాది ఇండ్లను సందర్శించినట్లు ఫీల్డు లెవెల్ నుంచి నివేదికలు వస్తున్నా, వాటిలో వాస్తవమెంత? అన్నది అంచనా వేసేందుకు కంట్రోల్ రూమ్ వంటివి ఎంతో ఉపయోగ పడుతాయని అధికారులు భావిస్తున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ కి సంబంధించి కూడా సుమారు 25 వేల నుంచి 26 వేల వరకు సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉండటాన్ని గుర్తించిన అధికారులు సర్టిఫికెట్ల జారీకి తగిన ఆదేశాలు జారీ చేయటంతో పెండెన్సీ కాస్త కేవలం ఆరు వేలకు పడిపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా తరుచూ లోపాలు, తప్పిదాలతో పాటు అక్రమాలు బయట పడుతున్న ఎంటమాలజీ, పారిశుద్ధ్యం వంటి విభాగాలను గాడీన పెట్టేందుకు త్వరలోనే క్షేత్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు సన్సాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆరోగ్య పరమైన సేవలతో పాటు ఇతర అత్యవసర సేవల్లోని లోపాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ టాస్క్ ఫోర్స్ బృందాలకు కొత్తగా సిబ్బంది నియామకం అంటూ ఏమీ లేకపోయినా, ఒక సర్కిల్ లో వివిధ రకాల సేవలను తనిఖీ చేసే, పర్యవేక్షించ సిబ్బందిని ఇతర సర్కిల్స్ కు టాస్క్ ఫోర్స్ టీమ్ లుగా ఏర్పాటు చేసే రంగంలోకి దింపితే ఫీల్డు లెవెల్ లో ప్రజలకు అందుతున్న సేవల ఏ పాటివో బయటపడుతాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ బృందాలతో ఫుడ్ సేఫ్టీని కూడా క్షేత్ర స్థాయిలో పూర్తిగా అమలు చేసే అవకాశమేర్పడుతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పాత జీహెచ్ఎంసీ లోని అన్ని విభాగాలను ప్రస్తుతం మూడు కార్పొరేషన్లకు తగిన విధంగా చేపట్టిన రీ మ్యాపింగ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు, అది పూర్తయిన వెంటనే ఈ టాస్క్ ఫోర్స్ బృందాలు, కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఆరోగ్య పరమైన అత్యవసర సేవల పర్యవేక్షణను నిరంతరం పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: CM progress report: 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు.. కోర్ అర్బన్ చట్టం, ఇంకా ఎన్నో…