CM progress report: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా.. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో, కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ ఆర్బన్ ప్రాంతంలో పర్మిషన్లు, ఫీజులు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ఈ వారం మున్సిపల్ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులే మొదట చేపడతామని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లింక్ చేయాలన్నారు. తరచుగా తనిఖీలు తప్పనిసరి చేయాలన్నారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అధునాతన సామాగ్రి, టెక్నాలజీ సమకూర్చుకోవాలని సూచించారు. నగరంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. సిటీలో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లని పరిశీలించి, తగిన సూచనలు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నాయకులు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్, బడే చొక్కారావు, పోతుల కల్పన, నూనె నర్సింహారెడ్డి.. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తమ అంతరంగాన్ని ఆవిష్కరించగా.. తన పరిధిలోని అంశాలను తప్పకుండా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సాయుధ పోరాటాన్ని విరమిస్తామన్నారు మావోయిస్ట్ అగ్రనేతలు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని కూడా రద్దు చేస్తామన్నారు. ఇకపై ప్రజా జీవితంలోనే ఉండి, చట్టపరంగా ఉద్యమ పంథా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తామంతా రాజకీయంగా పురోగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే.. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామన్నారు. ఈ ప్రతిపాదనని.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని.. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ.. ఆధిపత్యాన్ని ఒప్పుకోరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసిన గ్రూప్ వన్, గ్రూప్ టు ఆఫీసర్లని ముఖ్యమంత్రి అభినందించారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా 4 కోట్ల మందికి ప్రజా పాలన అందించేందుకు.. శిక్షణ, అనుభవాన్ని వినియోగించాలన్నారు. 2011 తర్వాత 2025 వరకు గ్రూప్ 1 నిర్వహించలేని పరిస్థితుల్లో.. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని సమూలంగా ప్రక్షాళన చేసి, పరీక్షలు నిర్వహించామన్నారు. ఉద్యోగంలో మీరు చూపే చొరవే.. ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరువ చేస్తాయన్నారు. ప్రభుత్వం ఎంత గొప్ప నిర్ణయాలు చేసినా, అధికారులు ప్రదర్శించే చిత్తశుద్ధే.. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందన్నారు. హెచ్ఆర్డీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా ప్రభుత్వ ప్రతిష్టని నిలబెట్టాలన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోని వారికి.. ఉద్యోగుల జీతాల్లోంచి కోత పెట్టి వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయబోతున్నట్లు తెలిపారు.
ఇక.. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులతో ఎగ్జిక్యూటివ్ క్లాసులు నిర్వహించడానికి సంబంధించి త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించేలా.. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్లాస్ రూమ్స్, క్రీడా మైదానం, ఇతర వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యంతో పాటు అన్ని రకాల వసతలు కల్పించాలన్నారు. ఈవారం విద్యాశాఖపై రివ్యూ చేసిన సీఎం.. నాణ్యమైన విద్యకు చిరునామాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం.. ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గబోమన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో.. ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలల తరహాలో నిర్మించాలన్నారు. ఏడాదిలో క్యూర్ పరిధిలో 12 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలన్నారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో ఎలాంటి రాజీ పడొద్దన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్‌లో.. వారం పాటు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు.. స్కూళ్లని, కాలేజీలను సందర్శించి అవసరమైన వసతులు, ఇతర అంశాలను తెలుసుకొని.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు అందజేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు కిట్ అందజేయాలన్నారు. అన్ని యూనివర్సిటీలకు ఎంతమేరకు నిధులు అవసరమనే దానిపై రిపోర్ట్ సమర్పించాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై.. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి రిపోర్ట్ సమర్పించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ విద్యా విధానంపై రూపొందించిన నివేదికను.. తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు సీఎంకు సమర్పించారు. అమెరికా, వియత్నాం, మలేషియా లాంటి దేశాల్లో పర్యటించడంతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై రిపోర్ట్ ఇవ్వాలని.. కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.
ఈ వారం సీఎం రేవంత్ రెడ్డిని.. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కలిశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కీలక ముద్ర వేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి ఇద్దరూ చర్చించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన.. తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగానూ శంతను నారాయణ్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ ట్రెండ్స్, ఏఐలో సరికొత్త అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఏఐతో వివిధ రంగాల్లోని ఉద్యోగాలపై పడే ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలు, వివిధ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణని ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‍గా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం కీలక సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు అడోబ్ సీఈవో శంతను నారాయణ్.
దశాబ్దాల తమ కోరికను నెరవేర్చేలా.. ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రికి.. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కోటీ 20 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయడంతో పాటు 1,056 కోట్ల మూలనిధితో ఆరోగ్య పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, 1998 వ్యాధులకు నగదు రహతి చికిత్సలు పొందే అవకాశం కల్పించడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఓ వరమని కొనియాడారు. రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి.. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రమాద బీమా పథకానికి.. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కోటీ 20 లక్షల బీమా పరిహారం అందుతుంది. 60 ఏళ్ల వరకు సహజ మరణానికి ఉద్యోగులకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. ఏడున్నర లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఇక.. ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఆరోగ్య భద్రతకు.. క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడున్నర లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు దాదాపు 3 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు సహా మొత్తం 17 లక్షల మందికి పైగా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంతో.. ప్రభుత్వ ఉద్యోగులు ఆస్పత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 652 ప్రైవేట్ ఎం-పానెల్ హాస్పిటల్స్‌లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై.. 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో.. తెంలగాణ వైద్య విధాన పరిషత్‌ని.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ మేరకు.. మెట్రో ఫేజ్-1ని ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. మెట్రో ఫేజ్-2 విస్తరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్నాయి. రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటుకు 223 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయించారు. టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలోకి 239 ఎకరాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. మహబూబాబాద్ మండలం గుమ్మడూరులో జేఎన్టీయూ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, సిద్దిపేట జిల్లా ఉమ్మాపూర్‌లో ఇంజనీరింగ్ కాలేజీకి 36 ఎకరాలు, మరో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ నుంచి తీసుకున్నందున.. సమాన విలువైన భూముల కింద కాప్రా మండలంలో 153 ఎకరాలు బదలాయించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు.. రెన్యువబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ చేసింది.
గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి అంశాలపై.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని, ఈ విషయంలో ఎవరికీ, ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ఈ వారం ములుగు జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి.. దేవాదుల ఇంటేక్ పాయింట్ దగ్గర మోటార్లను పరిశీలించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై రివ్యూ నిర్వహించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో.. శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామన్నారు. ప్రణాళికబద్ధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేసి 967 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చుకుని ఉంటే, వరద జలాలపైనా, వాటా నీటిని తరలించడానికి అవకాశం ఉండేదన్నారు. 2001 లో మొదలైన దేవాదుల.. రెండు దశాబ్దాలు దాటినా ఇంకా సాగుతూనే ఉందన్నారు. 8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉండటం వల్ల.. ప్రాజెక్టుకలు నిధుల కొరత వస్తోందన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులపై పూర్తి స్థాయి రివ్యూ చేసి.. వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా.. భూసేకరణ కోసం జూన్ 2 లోపు 600 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నెల రోజుల్లోపు దేవాదుల పంప్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానెల్‌లో పరిహారం నిధులు మంజూరు చేస్తామని, భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరందించే అందించే ప్రణాళికపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Story by: Anup, Big Tv