Tejaswini Nandamuri handovered 50 lakhs cheque to Reventh reddy: రెండు తెలుగు రాష్ట్రాలు రీసెంట్ గా వచ్చిన వర్షాలు, వరదలతో విలవిలలాడాయి. అటు బుడమేరు, ఇటు మున్నేరు వరదలకు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినా..ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ తాము సైతం అన్న చందాన ఎందరో అన్నార్తులను ఆదుకునేందుకు, వరద బాధితుల కోసం వస్తు రూపేణా, ధనం రూపేణా సాయం అందించేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. పెద్ద మనసున్న పెద్ద హీరోలు అనిపించుకున్నారు. దాదాపు ప్రతి టాలీవుడ్ అగ్ర హీరో రూ.కోటి సాయం రెండు తెలుగు రాష్ట్రాలకు అందించారు. రూ.50 లక్షలు తెలంగాణకు, రూ.50 లక్షలు ఆంధ్రా కు అందించాలని ధన రూపేణా అందజేశారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
బాలయ్య సేవా స్ఫూర్తి
ఇదే స్ఫూర్తితో నందమూరి బాలకృష్ణ ఓ టాలీవుడ్ హీరోగా తన వంతు సాయాన్ని కోటి రూపాయలు ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. బాలకృష్ణ ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించి అందులో పేద రోగులకు ఉచితంగా వైద్యం అందజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తమ సేవలను మరింతగా విస్తరించారు. గతంలోనూ రాష్ట్రంలో ఏ విపత్తు వాటిల్లినా తానున్నానంటూ ముందుకు వచ్చేవారు. ప్రజాసేవ చేయడంలో ఎంతో ఆసక్తిని కలిగివుండే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం ప్రజలకు కూడా అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
రెండేళ్ల క్రితమే అక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఏర్పాటు చేశారు. ఇందుకోసం 40 లక్షల రూపాయలతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి అందులోనే వైద్య సిబ్బంది, ఉచిత మందులు ఏర్పాటు చేశారు. హిందూపురం పరిధిలో రోజుకో గ్రామానికి ఎన్టీఆర్ ఆరోగ్య రథం చేరుకునేలా ప్లాన్ చేశారు. సాధారణ వ్యాధులకు వాహనం వద్దే వైద్య సేవలు అందించేవారు. ఇక ఇతర వైద్య సేవలు అత్యవసరమైతే వారిని పట్నంలో ఉండే ఇతర ఆసుపత్రులకు తమ సొంత ఖర్చుతో వైద్యం చేయించేవారు. బాలయ్యే కాదు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా మంగళగిరి ప్రాంతంలో సంజీవని ఆరోగ్య రథం పేరుతో ఉచిత సేవలు అందిస్తున్నారు.
చెక్కు అందజేత
ఇక బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని బాలయ్య కు సంబంధించిన సినీ వ్యవహారాలను ఆమె దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. కాస్ట్యూమ్స్, మేకప్ వంటి విషయాలలో తండ్రికి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. బాలకృష్ణ రియాలిటీ షో అన్ స్టాపబుల్ కి తేజశ్విని క్రియేటిక్ కన్సెల్టెంట్ గా పనిచేశారు. తండ్రిని గ్లామర్ పరంగా యంగ్ గా చూపించేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు తేజస్విని. ఆమె భర్త శ్రీ భరత్ విశాఖ పట్నం నుంచి తెలుగుదేశం కూటమి తరపున పోటీ చేసి గెలిచారు. శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలోనూ తేజస్విని చురుకుగా పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ తెలంగాణ వరద సాయం ప్రకటించి అందుకు సంబంధించిన రూ.50 లక్షల చెక్కును తన చిన్న కుమార్తె తేజస్విని చేతుల మీదుగా రేవంత్ రెడ్డికి అందజేయాలని కోరారు. తేజస్విని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఈ చెక్కును అందించారు.