Nizamabad Murder: నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ సంచలనం చోటుచేసుకుంది. పట్టపగలే, వందలాది మంది జనసంచారం ఉండే నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
అసలేం జరిగింది?
నగరంలోని రద్దీగా ఉండే ఆర్ ఆర్ చౌరస్తా వద్ద హరిబాబు అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక కారులో వచ్చిన ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. కారులోంచి దిగిన ఓ యువకుడు కొబ్బరిబోండాలు నరికే కత్తితో హరిబాబుపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి హరిబాబు పరుగులు తీసినా, దుండగులు వెంబడించి మరీ ఆయన మెడ, గొంతు భాగాల్లో తీవ్రంగా పొడిచి దారుణంగా హత్య చేశారు.
యూట్యూబర్ వైష్ణవి కేసుతో లింక్?
హత్యకు గురైన హరిబాబు సాధారణ వ్యక్తి కాదని, గతంలో సంచలనం సృష్టించిన ‘యూట్యూబర్ వైష్ణవి’ హత్య కేసులో ప్రధాన నిందితుడని సమాచారం. వైష్ణవి హత్యకు ప్రతికారంగానే.. పాత కక్షలను మనసులో ఉంచుకుని ప్రత్యర్థులు ఈ పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
రంగంలోకి పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రక్తపు మడుగులో పడివున్న హరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో నిజామాబాద్ నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Read: రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?