Crime Series: రైల్వే తత్కాల్ టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని సెకన్లలోనే ఖాళీ అయిపోవడం మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అసలు ఆ టికెట్లు ఎవరు బుక్ చేస్తున్నారు అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా ? దీని వెనుక ప్రయాణికులకు టికెట్ దొరకకుండా చేసే పెద్ద నెట్‌వర్క్ ఉంటే… ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తయారు చేసిన చిన్న సాఫ్ట్‌వేర్ కోట్ల రూపాయల స్కామ్‌కు దారి తీస్తే… దాన్ని ఛేదించేందుకు ఓ ఆర్పీఎడ్ అధికారి రంగంలోకి దిగితే ? ఇలా టెక్నాలజీ, అక్రమ బిజినెస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కామెడీ వంటి అంశాలు కలిసిన క్రైమ్ డ్రామానే ‘వెయిటింగ్ హై’ (Waiting Hai). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే..
పాట్నా నేపథ్యంలో సాగే ఈ కథలో అఫ్రోజ్ హంజా ఓ టెక్ సావీ హ్యాకర్. రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేయడం ఎంత కష్టమో అతడికి తెలుసు. తాను ఇష్టపడే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో, తత్కాల్ బుకింగ్ మొదలైన వెంటనే సెకన్లలో టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ తయారు చేస్తాడు. అతను సరదాగా చేసిన ఈ ప్రయోగం ఊహించని మలుపు తిరుగుతుంది. అఫ్రోజ్ తయారు చేసిన టెక్నాలజీ వెనుక పెద్ద బిజినెస్ అవకాశం ఉందని అతని మామయ్య గుర్తిస్తాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఈ టెక్నాలజీని డబ్బు సంపాదించే మార్గంగా మార్చాలని ప్లాన్ చేస్తారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టికెట్ ఏజెంట్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి తత్కాల్ టికెట్ల చుట్టూ ఓ భారీ దందాను నడిపించే ప్రయత్నం మొదలవుతుంది. ఇదంతా జరుగుతుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సుగమ్ మిశ్రాకు అనుమానం వస్తుంది. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే కొన్ని సెకన్లలోనే సీట్లన్నీ ఖాళీ అయిపోవడం అతడిని ఆలోచనలో పడేస్తుంది. సాధారణ ప్రయాణికులు అంత వేగంగా బుక్ చేయడం అసాధ్యమని గుర్తించిన సుగమ్… రైల్వే బుకింగ్ సిస్టమ్‌ను ఎవరో టెక్నాలజీతో మానిప్యులేట్ చేస్తున్నారని అనుమానిస్తాడు.
దర్యాప్తు మొదలైన తర్వాత సుగమ్ కు ఒక్కొక్కటిగా కొత్త లింకులు కనిపిస్తాయి. ఒకవైపు అఫ్రోజ్, అతని మామయ్య తమ దందాను విస్తరించేందుకు ప్రయత్నిస్తుంటే… మరోవైపు పోలీసులు ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు వేట మొదలుపెడతారు. టికెట్ ఏజెంట్లు, మధ్యవర్తులు, డబ్బు కోసం పనిచేసే వ్యక్తులు ఇలా ఒక్కొక్కరు కథలోకి రావడంతో స్టోరీ మలుపు తిరుగుతుంది. సుగమ్ దర్యాప్తుతో అఫ్రోజ్‌కు తప్పించుకునే మార్గాలు తగ్గిపోతుంటాయి. టెక్నాలజీతో పోలీసులను మభ్యపెట్టగలమని అతడు భావిస్తే… సుగమ్ మాత్రం అసలు నెట్‌వర్క్ ఎక్కడి నుంచి నడుస్తుందో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ? ఈ తత్కాల్ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరు ? అఫ్రోజ్ తన సొంత సాఫ్ట్‌వేర్‌కు బలైపోతాడా ? సుగమ్ ఈ మొత్తం దందాను ఎలా ఛేదిస్తాడు ? అన్నదే సిరీస్ లో చూడాల్సిన ఉత్కంఠభరితమైన కథ.
‘వెయిటింగ్ హై’లో దివ్యేందు శర్మ (Divyenndu Sharma), భువన్ అరోరా, హర్షిత గౌర్, విజయ్ మౌర్య, కుముద్ మిశ్రా, యష్‌పాల్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. సమీర్ విద్వాన్స్ (Sameer Vidwans) దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ (Amazon MX Player)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం హిందీ ఒరిజినల్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు.
Read Also: జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా