Artificial Paneer: స్వేచ్ఛ బ్యూరో: వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్ ఇతర హానికర పదార్థాలతో తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్, ‘అనలాగ్’ పన్నీర్ ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలతో తయారుచేసిన పన్నీరా లేక ఇతర పదార్థాలతో చేసిన పన్నీరా అనేది బట్టబయలు చేసేందుకు ఇక ఫ్యాక్టరీ నుంచి ఫుడ్ ప్లేట్ వరకు ప్రతి దశ అధికారుల నిఘాలోకి రానుంది. ఇన్నాళ్లు అడ్డగోలుగా సాగిన కల్తీ పన్నీర్ దందాకు ఎట్టకేలకు ప్రభుత్వం చెక్ పెట్టింది.
సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి..
సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం ప్రకారం ఇలాంటి పన్నీర్ తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు తదితర ఆహార సంస్థల్లో వినియోగంపైనా ఆంక్షలు ఉన్నాయి.
ప్రమాదకరంగా పన్నీరు తయారీ విక్రయాలు
సాధారణ పన్నీర్‌ను పాలను గడ్డకట్టించి తయారు చేస్తారు. ఇందులో పాలలోని సహజ ప్రొటీన్లు, కొవ్వు తదితర పోషకాలు అందులో ఉంటాయి. వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్ తో నకిలీ పన్నీర్ తయారు చేస్తున్నారు. ఇందులో ప్రోటీన్ ఉండకపోగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి.
గుట్టు రట్టు చేసేందుకు అధికార యంత్రం సిద్ధం
పన్నీర్ వినియోగం అధికంగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాపులు, క్యాటరింగ్ సంస్థలు, డెయిరీ పార్లర్లపై ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టనుంది.
తయారీ నుంచి విక్రయాల వరకు స్పెషల్ ఫోకస్..
పన్నీర్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు సరఫరా చేశారు. ప్యాకెట్‌పై ఏముంది? పన్నీర్ కొనుగోలు చేసిన బిల్లులపై ఫోకస్ చేయనున్నారు. నకిలీ, నిషేధిత పన్నీర్ దందాను నియంత్రించే లక్ష్యంలో హోటళ్లను తనిఖీ చేయడంతో పాటు తయారీ కేంద్రం, సప్లై, విక్రయాలపై నిఘా పెట్టినట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనిఖీలకు రంగం సిద్ధం
హైదరాబాద్ నకిలీ పన్నీరు తయారీ, విక్రయాలకు రవాణాకు కేంద్ర బిందువుగా ఉండగా .. రాష్ట్ర రాజధానికి సరిహద్దుగా ఉన్న
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిధిలో పన్నీర్ వినియోగంపై ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి స్పెషల్ ఫోకస్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెద్ద ఎత్తున హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండటం.. హైదరాబాద్ కు కొత్త దూరంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా విస్తరించి ఉండటం కల్తీ పన్నీరు ఉమ్మడి జిల్లాలోనూ ఉపయోగించే ఛాన్స్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన అనలాగ్ పన్నీర్ పై జ్యోతిర్మయి ఆధ్వర్యంలో తనిఖీలకు రంగమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోటళ్లలో నిలువ చేసిన ఆహారం, ఫుడ్ లైసెన్సులు, ఇతర అంశాలపై నిత్యం తనిఖీలు చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్న ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఇకపై ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కల్తీ పన్నీర్ విక్రయాలకు, రవాణాకు బ్రేక్ వేసేందుకు సిద్ధమైంది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
నిషేధాన్ని ఉల్లంఘిస్తూ నాన్-డెయిరీ/అనలాగ్ పన్నీర్‌ను తయార, నిల్వ, రవాణ, పంపిణీ, విక్రయించినా ఆహార సంస్థల్లో ఉపయోగించినా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి చెప్పారు. అనలాగ్ పన్నీరు విక్రయాలను నిషేధిత రూల్స్ పాటించకుండా అమ్మకాలను కొనసాగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరిశీలించి ఫిర్యాదు చేయండి..
పన్నీరు కొనుగోలు చేసే సమయంలో బ్యాచ్ నంబర్ తయారీ, గడువు తేదీలను, లేబుల్, బిల్లులను పరిశీలించి అనుమానం వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి చెప్పారు.
Also Read: రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!