Konda Surekha: మాజీ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పదవి నుంచి బర్తరఫ్ కావడం, నియోజకవర్గంలో ఎదురవుతున్న రాజకీయం, పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారలపై ఆమె తన శైలిలో స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో తమ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందో వివరిస్తూ.. సొంత పార్టీలోని ప్రత్యర్థులకు అలాగే ఇతర నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
బర్తరఫ్ పై ఆవేదన.. కార్యకర్తలే మా బలగం
పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ అకారణంగా తనను బర్తరఫ్ చేశారనే బాధ మాత్రమే మనసులో ఉండిపోయిందని సురేఖ వ్యాఖ్యానించారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా ఒక్కటేనని, కార్యకర్తల కోసమే ఎప్పుడూ నిలబడ్డామని గుర్తుచేశారు. ‘నన్ను పదవి నుంచి తీసివేయగానే అభిమానులు గొడవలు చేస్తామంటే నేనే వారించాను. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి సైలెంట్ గా ఉండమన్నాను. 10 రోజులుగా నా అనుచరులు నలిగిపోయారు. ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగాను, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కార్యకర్తలు మా వెంటే ఉన్నారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
గుంటనక్కల కుట్రలు.. ఆ తప్పు వల్ల నష్టం
మహానేత వైఎస్సార్ ఉన్నంతకాలం ఎవరి కుట్రలు సాగలేదని, ఆయన మరణం తర్వాతే తమపై గుంటనక్కలు కుట్రలు చేయడం మొదలుపెట్టాయని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కొండా దంపతులకు మంచి పేరు ఉండేదని, నమ్ముకున్న వాళ్ల కోసమే మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆహ్వానంతో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి 50 వేల ఓట్లతో ప్రత్యర్థిని ఓడించామని, అయితే ఆ తర్వాత తూర్పు వదిలి పరకాలకు వెళ్లడమే తాము చేసిన పెద్ద తప్పని అంగీకరించారు. అక్కడ అక్రమ సంపాదనతో నేతలను కొనుగోలు చేసి తమను ఓడించారని ఆరోపించారు.
కాంగ్రెస్ తోనే ప్రయాణం.. హెచ్చరికలు
తాము ఏ ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగాము కాబట్టి ఇందులోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ‘అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏ పార్టీకీ వెళ్లవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే పని చేస్తాం. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖదే’ అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తమ సహాయం పొంది ఇప్పుడు తమపైనే మాట్లాడుతున్న నాయిని రాజేందర్ రెడ్డి, సారయ్య వంటి నేతలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాము ఇంట్లో కూర్చునే వాళ్లం కాదని, త్వరలోనే కొండా మురళికి కార్పొరేషన్ పదవి కూడా వస్తుందని వెల్లడించారు.
Also Read: మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి