Arya Vaishya: ఆర్య వైశ్యుల ఆత్మాభిమానం, సమాజ నిర్మాణంలో వారి పాత్రను కొనియాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక శ్రేయస్సులో ఆర్యవైశ్యులు వహిస్తున్న కీలక పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఎంతటి పేదరికం ఉన్నా ఆత్మగౌరవాన్ని వీడని మనస్తత్వం ఆర్యవైశ్యుల సొంతమని, గ్రామీణ వ్యవస్థలో కష్టసమయాల్లో ఆదుకునే మొదటి చేయి వారిదేనని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
రోశయ్య నన్ను గుర్తించి ఆశీర్వదించారు..
ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత కే. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణ, అనుభవంతో ముందుకు సాగాలని రోశయ్య తనకు మార్గదర్శనం చేశారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ సమయానికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండటానికి నాటి ఆర్థిక మంత్రిగా రోశయ్య చూపిన దూరదృష్టియే కారణమన్నారు. ఆయన సేవలను గౌరవిస్తూనే హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
దేశానికి గాంధీజీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వరకు ఆర్యవైశ్య ప్రముఖులు చరిత్రలో చెరగని ముద్ర వేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రపంచస్థాయి నేతగా ఎదిగిన గాంధీజీ కాంగ్రెస్ నాయకుడు కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం, సమాజ పురోగతి కోసం ఆర్యవైశ్యులు చేసిన త్యాగాలు ఎనలేనివని అభిప్రాయపడ్డారు.
మాట ఇస్తే తప్పను..
ప్రస్తుత రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ రంగాన్ని, వాటాను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం పిలుపునిచ్చారు. సమైక్యంగా ఉంటేనే తగిన గుర్తింపు లభిస్తుందని, తమ ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్ సహా స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించిందని తెలిపారు. ఆర్యవైశ్య పేద బిడ్డల కోసం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.