E-Paper
Advertisement

‘ఒక్క నిమిషం కరెంట్ పోయినా ఊరుకోం’.. అధికారులకు కేబినెట్ స్ట్రాంగ్ వార్నింగ్!

‘ఒక్క నిమిషం కరెంట్ పోయినా ఊరుకోం’.. అధికారులకు కేబినెట్ స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Dharani SIT: స్వేచ్ఛ బ్యూరో: భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలు..

Advertisement

ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో దాదాపు 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని ఈ రోజు మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లీజింగ్ , ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ పాత్రతో పాటు, పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక, టెండర్ ప్రక్రియ, వెండర్‌కు కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో ఉన్న లోపాలపై విచారణ జరపాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.

కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు..

Advertisement

ఈ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా వివరాలను మంత్రులు పొంగులేటి శ్​రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్​ లు మీడియాకు వివరించారు. ధరణిలో పోర్టల్‌ తర్వాత కొన్ని మాడ్యుల్స్ మార్చి రైతులకు ఉపయోగంగా ఉండేలా మా ప్రభుత్వం భూభారతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటికీ ఆనాడు సాఫ్ట్ వేర్ రూపకల్పన చేసిన పోర్టల్ లో ఉన్న లోపాలతో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రులు తెలిపారు. అందుకే ధరణి వ్యవహారంలో బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకందన్నారు. సిట్ వేసి బాధ్యులను గుర్తించాలని నిర్ణయించిందన్నారు.

ఎన్ నినోపై అలర్ట్..

ఇక రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు,ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పంటల సాగు వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం, తాగునీరు సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితులను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉంది.

అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు..

తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున, అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు చేసే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఎల్ నినో ప్రభావం.. అవగాహన సదస్సులు, సమావేశాలు..

అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తితో పాటు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును రైతులు నివారించి, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కేబినేట్ విజ్ఞప్తి చేసింది. ఎల్ నినో ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించింది.రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించింది.

అత్యవసర సమీక్ష సమావేశాలు..

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన పంటలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలతో పాటు పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలతో నివేదిక అందించాలని కోరింది. అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, వెంటనే చేపట్టాల్సిన చర్యలను తెలుసుకునేందుకు అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లా ఇన్ ఛార్జీ మంత్రితో పాటు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రకృతి గండం నుంచి గట్టెక్కేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, సమన్వయంతో పనిచేసి వర్షాభావ సంక్షోభాన్ని అధిగమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఇంజినీరింగ్ వ్యవస్థ మానిటరింగ్ కు హై లెవల్ కమిటీ..

ప్రభుత్వం చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో పరిపాలన అనుమతులతో పోలిస్తే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంచనా వ్యయానికి, అయ్యే వ్యయానికి పొంతన కుదరటం లేదు. పనులు సకాలంలో పూర్తి కావటం లేదు. మంజూరైన అంచనాలు, సవరించిన అంచనాలతో పని పూర్తయ్యే వరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. అందుకే పనుల అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రపోజల్, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు విధివిధానాలన్నింటికీ ఒక యూనిఫైడ్ విధానాన్ని రూపొందించాలని కేబినేట్ నిర్ణయించింది. సీఎస్ అధ్వర్యంలో వీటన్నింటి సమగ్ర సమీక్షకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ వరకు అన్ని దశలను పరిశీలించేలా నిర్దిష్ట విధివిధానాలతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గ్రామ పంచాయితీ నిధులు జమ లో మార్పు..

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికైన సంస్థల్లో ట్రాన్సెజెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.గ్రామపంచాయతీల నిధుల నిర్వహణకు సంబంధించి తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రామపంచాయతీలకు అందే నిధులను ట్రెజరీలో జమ చేసే విధానం ఉంది. ఈ నిబంధనను మార్చి సమీపంలో ఉన్న జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ నిధులను జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.

సవరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..

అందుకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ అండ్ బీ విభాగం రాష్ట్ర క్యాబినెట్ కు తెలియజేసింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్–పుణె–ముంబైకి ఒక రూట్, హైదరాబాద్–బెంగుళూరు మరో రూట్, హైదరాబాద్–అమరావతి–తిరుపతి–చెన్నై మరో రూట్ బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం.. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..

ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ పథకం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయిచింది. ఇప్పటికే పూర్తయిన పనులను అంచనా వేసుకొని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపింది.

Related News

పగలు కోడింగ్.. రాత్రి దోపిడీ! ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్ట్‌టైమ్ జాబ్ తెలిస్తే షాకవుతారు!

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్‌గా భాగ్యనగరం- రాంచందర్ రావు

ఆబిడ్స్‌లో విషాదం.. ఏడో అంతస్తు నుంచి దూకి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. ధరణిపై ‘సిట్’, కరువు పరిస్థితులపై సమీక్ష!

రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Big Stories

Advertisement
×