
Telangana Elections 2023 : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారుతున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా.. ప్రచార పర్వం ఊపందుకుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సహా 1100 మందికిపైగా అభ్యర్థులు పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలతో ప్రచారాలు చేస్తుంటే.. బీజేపీ ఇంతవరకూ మేనిఫెస్టోను విడుదల చేయలేదు. కాంగ్రెస్ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పగా.. బీఆర్ఎస్ రూ.400కే ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ క్రమంలో మరో పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఏడాదికి రూ.1 కే నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రకటించింది.
ఈ పార్టీ తరపున కుమ్మరి వెంకటేష్ యాదవ్ పోటీ చేస్తుండగా.. నియోజకవర్గంలో చేసిన ప్రచారంలో ఈ ప్రకటన చేశారు. అలాగే ఒక్కరూపాయికే ఉచిత విద్య, ఒక్కరూపాయికే వైద్య సలహా, ఒక్కరూపాయికే న్యాయసలహా అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ తరహాలో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమిస్తామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారు ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ నొక్కితే వెంటనే సహాయం అందుతుందని ప్రచారం చేస్తున్నారు. ఓట్లకోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చేస్తున్నారని విమర్శలు వస్తుండగా.. కొంతమంది ఓటర్లు ఇలాంటి వాటికి ప్రభావితమయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ ల మధ్య ప్రధాన పోటీ జరుగనుంది.