
Telangana Elections 2023 : గులాబీ బాస్ మరోసారి స్పీడ్ పెంచారు. నేటి నుంచి రెండో విడత ప్రచార సభలకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. గురువారం ఏకంగా మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అచ్చంపేట, 2 గంటలకు వనపర్తి, 3 గంటలకు మునుగోడు సభల్లో పాల్గొంటారు. ఈ సభల నిర్వహణకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజులపాటు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలను నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్.. 18వ తేదీ వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్ సభల్లో పాల్గొన్నారు.
ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు సీఎం కేసీఆర్. 19 నుంచి 25 వరకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలకు విరామం ప్రకటించారు. అయితే ముందుగా విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో ముఖ్యమంత్రి నామినేషన్లు వేయనున్నారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజాశీర్వాద సభలకు బీఆర్ఎస్ భారీగా జనసమీకరణ చేస్తోంది. ప్రతీ సభకు కనీసం లక్ష మందిని తరలించేలా లక్ష్యంగా పెట్టుకుంది.
రెండో విడత ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఏఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మేడిగడ్డ అంశాన్ని ప్రస్తావిస్తారా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు. తన ప్రసంగాల్లో కేసీఆర్ మరింత దూకుడు పెంచుతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు సైతం రానున్నందున.. మరి కేసీఆర్ తన మాటల దాడికి మరింత పదును పెడతారా? లేదా? అన్నది చూడాలి.