తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. దీంతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి అన్ని పార్టీలు. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఇక బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు తెలంగాణలో ల్యాండ్ కానున్నారు.
నేడు, రేపు రాష్ట్రంలో ప్రియాంక గాంధీ సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో, సాయంత్రం మూడు గంటలకు కొత్తగూడెంలో నిర్వహించే ప్రచార ర్యాలీలో ప్రియాంక పాల్గొంటారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
ఈరోజు రాత్రి ఖమ్మంలోనే ప్రియాంక గాంధీ బస చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తుపల్లి, 2.40 గంటలకు మధిర ప్రచార సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని, గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు. దీంతో ఆమె పర్యటన ముగియనుంది.
మరోవైపు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటనకు రెడీ అయ్యారు. అమిత్ షా ఏకంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో మకాం వేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.
ఇక శనివారం ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఇక ఆదివారం (నవంబర్ 26) మక్తల్, ములుగు, భువనగిరి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఇక రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు మేడ్చల్, కార్వాన్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా రెండు రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రచారసభల్లో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్ చేరుకొని అంబర్‌పేట నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.
ఇదిలా ఉంటే రాహుల్‌గాంధీ కూడా సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపు తెలంగాణకు రానున్న రాహుల్.. ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. తొలుత బోధన్‌లో జరిగే విజయభేరి సభకు హాజరవుతారు. అదే రోజు ఆదిలాబాద్, వేములవాడల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లుండి నుంచి ప్రధానమంత్రి మోడీ కూడా తెలంగాణలో టూరేయబోతున్నారు. మూడు రోజుల్లో ఆరు బహిరంగ సభల్లో పాల్గొంటారు.