Government Reforms: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటం, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక పథకాల అమలు గడువు సమీపిస్తుండటంతో జూన్ నెల నుంచి సర్కార్ యంత్రాంగం పరుగు పెట్టనుంది. పరిపాలనలో వేగం పెంచడంతో పాటు, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ బిజీ బిజీ కానున్నారు. విద్యాశాఖలో మార్పులు, సరికొత్త స్కీమ్స్ లైనప్, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈసారి విద్యాశాఖపై ప్రభుత్వం ముందస్తుగానే డేగకన్ను పెట్టింది. నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా “పూర్తి స్థాయి స్కూళ్ల పరిశీలన” కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.
జూన్ మొదటి వారం నుంచే సెక్రటేరియట్ స్థాయి అధికారులు, కలెక్టర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ సరుకు సకాలంలో చేరిందా లేదా అనే అంశాలపై స్పాట్ వెరిఫికేషన్ జరగనుంది. అంతేగాక బడులు తెరిచిన మొదటి రోజు నుంచే వంద శాతం ఉపాధ్యాయుల హాజరు ఉండేలా బయోమెట్రిక్ విధానాన్ని కఠినతరం చేయనున్నారు. అవసరమైన చోట రేషనలైజేషన్ (ఉపాధ్యాయుల సర్దుబాటు) ప్రక్రియను జూన్ లోనే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. మరోవైపు స్కూళ్లలో పెండింగ్ లో ఉన్న సివిల్ వర్క్స్, మౌలిక వసతుల పనులను మే చివరి వారంలోగా పూర్తి చేసి, జూన్ లో వాటిని ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు, ప్రజల్లో నమ్మకం పెంచేలా మరికొన్ని సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పథకాలకు (న్యూ స్కీమ్స్) జూన్ లో రూపకల్పన చేయనున్నారు.దీనికోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారుల కమిటీలను రంగంలోకి దించారు.మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మైక్రో-బిజినెస్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాబోతున్నట్లు తెలిసింది. ఇక నిరుద్యోగ యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో “స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్” (నైపుణ్య కేంద్రాలు) ఏర్పాటుపై జూన్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: తండ్రి హత్యకు కొడుకు తీర్చుకున్న పగ… ఓటీటీలోకి ఇంటెన్సివ్ హిందీ క్రైమ్ డ్రామా
మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు, సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించేలా సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ మోడల్ ,హెల్త్ కార్డ్స్ విధానంపై స్టడీ జరుగుతోంది.రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతో పాటు, పంటల నమోదును పూర్తిగా డిజిటలైజ్ చేసే సరికొత్త సాఫ్ట్‌వేర్ ఆధారిత విధానాన్ని (రైతు భరోసా తదుపరి గైడ్‌లైన్స్) జూన్ లోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే మే నెల ముగిసేలోగా (ఈ వారంలోనే) అన్ని రకాల పెండింగ్ ఫైళ్లు, గతంలో మంజూరైన పనుల క్లియరెన్స్ పూర్తి కావాలని అధికారులకు సీఎంవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 నాటికి సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు డెస్కులు క్లియర్ గా ఉండాలని సీఎస్ తాజాగా ఆదేశాలిచ్చారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,ప్రభుత్వం ఈసారి కేవలం పథకాలను ప్రకటించడమే కాకుండా.. వాటి అమలుకు ‘టైమ్ బౌండ్ టార్గెట్స్ విధించుకుంది. ప్రతి శాఖకు రాబోయే 100 రోజులు, ఆరు నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా పథకాల ప్రగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ‘డ్యాష్ బోర్డ్’ను ఏర్పాటు చేస్తున్నారు.నిర్దేశిత టార్గెట్లను రీచ్ అవ్వని అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే అంతర్గత సంకేతాలు వెళ్లాయి.మే నెల ముగింపుతోనే పెండింగ్ పనులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి… జూన్ నుంచి సరికొత్త స్కీమ్స్, కఠినమైన మానిటరింగ్, స్కూళ్ల ప్రక్షాళనతో రాష్ట్రంలో సరికొత్త పాలనా వేగాన్ని చూపించేందుకు సర్కార్ సర్వసన్నద్ధమవుతోంది. మరోవైపు జూన్ 2 అవతరణ దినోత్సవాన్ని సంపూర్షంగా సక్సెస్ చేసేందుకు అధికారులంతా నిమగ్నమయ్యారు.
=ఇందిరమ్మ ఫేజ్ 2 ఇళ్లు
=2 లక్షల కొత్త ఫించన్లు
=ఇందిరమ్మ కుటుంబ బీమా
=ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ కు నిధులు సేకరణ
=కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక ఫోకస్
=ఉద్యోగులకు ఈహెచ్ ఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్
=టిమ్స్ సనత్ నగర్ ప్రారంభం
=అంగన్ వాడీ పోస్టుల భర్తీ ప్రాసెస్ కు యాక్షన్ ప్లాన్
=ఆర్టీసీ ఉద్యోగుల 11 శాతం ఫిట్ మెంట్ కు కార్యచరణ
=ఉద్యమకారులు, అమర వీరుల హామీలు నెరవేర్చేందుకు చర్యలు
Also read: కరోనా కంటే డేంజర్ వైరస్… ఒకసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు