Congress 6 Gurantees : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రజాపాలన’ నిర్వహిస్తోంది. దీని కోసం ఒక్కో గ్యారంటీకి వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేకుండా ఆరు గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
గడీల పాలనకు చరమగీతం పాడుతూ.. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు.. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. కాగా నేటితో ఈ కార్యక్రమం ముగియనుంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 28 నుండి ఆరు గ్యారంటీల ప్రోగ్రాంలో లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తుకు భారీగా స్పందన వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు పోటెత్తాయి. ప్రజాపాలన దరఖాస్తులతో పాటు చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు.
ఇప్పటి వరకు ప్రజాపాలన దరఖాస్తులు కోటి దాటాయి. ఆధికారులకు ఏడు రోజుల్లో మొత్తం 1,08,94,115 దరఖాస్తులు అందాయి. ఐదు గ్యారంటీల కోసం 93,38,111 మంది దరఖాస్తు చేయగా.. మిగతా అవసరాల కోసం 15,55,704 మంది అప్లై చేసుకున్నారు. 18,29,274 మంది అభయ హస్తంకు దరఖాస్తు చేసుకున్నారు. నేటితో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది.
ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ లలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్ ట్రైనర్స్ తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో డాటా ఎంట్రీ జరగనుండగా.. ఈనెల 17వ తేదీ తరువాత సంబంధిత అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ ని చేపట్టనున్నారు.
.
.