Telangana TDP : రేపో మాపో లిస్ట్ వస్తుందనుకుంటే.. అసలు పోటీలోనే ఉండట్లేదని తెలంగాణ టీడీపీ సంచలన ప్రకటన చేసింది. బరిలోకి దిగేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లకు అస్త్రసన్యాసం చేయండంటూ అధినేత నుంచి ఆదేశాలు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో పసుపు కోటలో కొత్త కొట్లాట మొదలైంది.
తెలంగాణలో టీటీడీపీ పోటీ చేయడం లేదని నారా లోకేష్ చెప్పారంటూ కాసాని చేసిన అనౌన్స్ మెంట్‌పై నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగాల్సిందేనంటూ తేల్చి చెబుతున్నారు. దాంతో కాసాని జ్ఞానేశ్వర్ పరిస్థితి ఇరకాటంలో పడింది. అటు పార్టీ హైకమాండ్ ఆదేశాలను దాటి వెళ్లలేక, ఇటు పార్టీ నేతలను బుజ్జగించలేక భావోద్వేగాలకు లోనయ్యారు. కాసాని నేతలతో నిర్వహించిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. తెలంగాణలో పోటీ చేయాల్సిందేనంటూ నేతల పట్టుపట్టారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ టీడీపీ పరిస్థితి మాత్రం ఇంకా ఎటూ తేలట్లేదనే చెప్పాలి. గతంలో అన్ని సీట్లలో బరిలోకి దిగుతామని.. మరోసారేమో 89 స్థానాల్లో పోటీ చేస్తామని.. ఇంకోసారేమో అసలు పోటీ చేయట్లేదని.. ఇలా రోజుకో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి కూడా తెలంగాణలో పోటీ చేయడం లేదని టీడీపీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. పేపర్లలో వచ్చిందని.. లోకేష్ చెప్పారని.. ఇలా సాగిపోతోంది. పోటీకి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసి వచ్చారు కాసాని. బయటికి వచ్చాక కూడా బరిలో ఉంటామనే చెప్పుకొచ్చారు. 24 గంటలు గడవక ముందే మళ్లీ లోకేష్ చెప్పారంటూ మీడియా ముందు ప్రకటించేశారు. అధిష్టానాన్ని ఒప్పిస్తామంటూ తిరిగి భరోసా కల్పించారు. మరి కన్ఫ్యూజన్‌లో ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఓ క్లారిటీ వస్తుందా? తెలంగాణలో పసుపు పార్టీ బరిలోకి దిగుతుందా? అన్నది తేలాలి.