daisugi : చెట్లను కొట్టేయకుండా కలపను పొందడం సాధ్యమా? అదీ 900 ఏళ్లుగా. 14వ శతాబ్దంలో జపాన్ కనుగొన్న ఆ టెక్నిక్ పేరే దాయ్‌సుగి(Daisugi). వృక్షసంపదను ప్రధానంగా దేవదారు చెట్లను కాపాడి.. భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో జపాన్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది.
కలప కోసం చెట్లను నరకకపోవడమే ఈ విధానం ప్రత్యేకత. దానికి బదులుగా కొమ్మలను మాత్రమే కొట్టేస్తుంటారు. అంటే ప్రూనింగ్ అన్నమాట. దేవదారు చెట్ల విషయంలో ఈ విధానాన్ని అనుసరిస్తే.. అవి నిటారుగా పెరుగుతాయి. కలప కూడా ఒకేలా ఉంటుంది. ఇళ్ల నిర్మాణంలో ఇదే బెస్ట్.
ప్రూనింగ్ అనేది ఒక కళ. దాంతో మొలకలేస్తూ చెట్టు పెరుగుతుంటుంది. సమూలంగా నరికేయాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. భూగోళాన్ని మూడోవంతు అడవులు కప్పేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా సహజ వనరులెన్నో వీటి ద్వారా లభిస్తున్నాయి.
1990-2020 మధ్య ప్రపంచ అటవీ విస్తీర్ణం 178 మిలియన్ హెక్టార్లు తగ్గింది. నరికివేతకు గురైన ఈ అటవీ విస్తీర్ణం లిబియా దేశమంత. దాయ్‌సుగి టెక్నిక్ ద్వారా అడవుల నరికివేతను అడ్డుకోవచ్చు. భూమి, విత్తనాల కొరత కారణంగా జపాన్ ఈ విధానాన్ని కనిపెట్టింది.
క్యోటో నుంచి దాయ్‌సుగి ఆరంభమైనా.. మూలాలు పురాతన రోమ్‌లో ఉన్నాయని చెబుతుంటారు. అక్కడ దానిని పలార్డింగ్(pollarding)గా పిలుస్తారు. దాయ్‌సుగి విధానం యూరప్ అంతటా.. ప్రధానంగా బ్రిటన్‌లోనూ అమల్లో ఉంది. అక్కడ దానిని కాపిసింగ్(coppicing)గా వ్యవహరిస్తారు.