Telangana: క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు.. బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురు అనే పాట గురించి చాలామందికి తెలుసు. మూడు దశాబ్దాల కిందట టాలీవుడ్‌లో వచ్చింది ‘గులాబీ’ మూవీ. ఈ లిరిక్స్ మాదిరిగా వ్యవహరిస్తే డిగ్రీ విద్యార్థులకు కష్టాలు తప్పవు. డిగ్రీలో కనీసం 75 శాతం హాజరులేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు.
కొద్దిరోజుల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలుకానుంది. గంపెడాశతో విద్యార్థులు డిగ్రీలో అడుగు పెట్టనున్నారు. ఈసారి మాత్రం స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నియమం రానుంది. అలా లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హత కోల్పోతారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
హైదరాబాద్‌లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఈ సమావేశంలో వారంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆఫీసులో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఏడు వర్సిటీల వీసీల సమావేశం జరిగింది. డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉండదు. ఆ తరహా ప్రభుత్వ ఆదేశాలు గతంలో ఉన్నాయని గుర్తు చేశారు.
ఇప్పటివరకు ఇది అమలు కాలేదని పలువురు వీసీలు ప్రస్తావించారు. ఈసారి విద్యార్థుల హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కచ్చితంగా ముడిపెట్టాలనే నిర్ణయానికి వారంతా వచ్చారు. దీనివల్ల విద్యార్థులు పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయన్నారు.
ALSO READ: తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు, ఆపై సునీతారావుకు ప్రశ్నలు
విద్యా నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండేవి. ఇప్పుడు వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు ఆయా వీసీలంతా. ఇకపై డిగ్రీ విద్యార్థులు తమ హాజరు విషయంలో తస్మాత్ జాగ్రత్త. లేకుంటే ఇబ్బందులు తప్పవు.