TGSRTC Dasara Offer: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువ గల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది.
ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తైన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది.
ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రా నిర్వహించినున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను ఆయా ఆర్ఎం కార్యాలయాలకు చేరుస్తారు. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అక్టోబర్ 8న అధికారులు ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి, ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానిస్తుంది.
దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.
Also Read: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల కోసం 7754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామన్నారు.