Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. నవంబర్ 11 (రేపు) జరగనున్న ఈ పోలింగ్‌లో గెలుపు, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో దీనిని అన్ని పార్టీలు జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ఈ కీలక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.
సీఈఓ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 139 ప్రాంతాలలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం (ఈసిఐ) నిబంధనల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాలను కల్పించారు. వీటితో పాటు, ప్రత్యేకంగా ఐదు ‘మోడల్ పోలింగ్ స్టేషన్లను’ సైతం ఏర్పాటు చేశారు. ఈ మోడల్ స్టేషన్లలో ఓటర్లను ఆకట్టుకునేలా అదనపు సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. మహిళల కోసం కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Read Also: Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: ఎన్నికల అధికారి కర్ణన్
ఎన్నికల భద్రతకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 68 పోలింగ్ స్టేషన్లను ‘క్రిటికల్’ (సమస్యాత్మక) పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ కీలక ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేకంగా సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి తొలిసారిగా డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. అంతేకాకుండా, 100% పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే, ప్రజలు 24/7 అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేసే ఈ కంట్రోల్ రూమ్‌తో పాటు, ‘1950’ అనే టోల్-ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా తమ ఇబ్బందులను తెలియజేయవచ్చని ఆయన సూచించారు. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సీఈఓ విజ్ఞప్తి చేశారు.
రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ సెలవు ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు, ఐటీ ఆఫీసులకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరగనుండగా.. ఆ ఏరియాలో సెలవు ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేయనున్నారు ఎన్నికల అధికారులు. మొదటిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. 139 పోలింగ్ లొకేషన్స్ లో 139 డ్రోన్లను అధికారులు వినియోగించనున్నారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానిస్తారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో సీఈవో సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ డ్రోన్ల ను పరిశీలించారు.
రేపు జరగబోయే జూబ్లీహిల్స్ పోలింగ్ పై డ్రోన్ లతో నిఘా
అందులో భాగంగా DRC సెంటర్ వద్ద డ్రోన్ డెమో షో
మొత్తం 139 డ్రోన్‌లతో నిఘా
డ్రోన్ డెమో షోను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ https://t.co/7DcP2CUVea pic.twitter.com/Qnr1Bw8zLb
— ChotaNews App (@ChotaNewsApp) November 10, 2025