Freebies Cobra Effect: ఇటీవల కాలంలో అధికారం కోసం నేతలు జపిస్తున్న మంత్రం ‘ఉచితం’. మేము అధికారంలోకి వస్తే అది ఫ్రీ..ఇది ఫ్రీ అంటూ చెప్పేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అలాగే కొన్ని ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. అయితే ఉచిత పథకాలు ఎంత ప్రమాదమే.. రానున్న కాలంలో జరిగే పరిణామాలపై సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది.
బ్రిటిష్ పాలనలో దిల్లీలో విషపూరిత పాముల(కోబ్రా) సంఖ్య పెరగడం చూసి అధికారులు ఆందోళన చెందారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పాములను చంపి తీసుకొస్తే కొంత డబ్బు ఇస్తామని ప్రకటించారు. మొదట్లో ఈ విధానం విజయవంతమైందని అనిపించింది, చాలా మంది కోబ్రాలను చంపి తీసుకొచ్చేవారు.
కానీ ఆ తర్వాత ఊహించని పరిణామం ఎదురైంది. కొందరు డబ్బు కోసం స్వయంగా కోబ్రాలను పెంచడం ప్రారంభించారు. ప్రభుత్వం ఈ లొసుగును గ్రహించి, కోబ్రా కార్యక్రమాన్ని రద్దు చేసింది. దీంతో ఇకపై పాములతో తమకు ఉపయోగం లేదని భావించిన స్థానికులు ఆ పాములను బయటకు వదిలేశారు. ఫలితంగా దిల్లీలో కోబ్రాలు మునుపటి కంటే ఎక్కువ స్థాయికి పెరిగాయి.
ఈ వ్యవహారం కోబ్రా ఎఫెక్ట్‌గా గుర్తుండిపోయింది. ముందు మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కోబ్రా స్కీమ్ చివరకు బెడిసికొట్టింది. అలాగే మంచి ఉద్దేశంతో ప్రోత్సాహకాలు ఎలా ఎదురుదెబ్బ తగలవచ్చో చెప్పడానికి కోబ్రా ఎఫెక్ట్ ఓ క్లాసిక్ ఉదాహరణ.
దేశంలో ఎక్కడ ఎన్నికల జరిగినా మొదటిగా వినిపించేది ఉచిత పథకాలు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ‘ఉచితాల’ వర్షం కురిపిస్తుంటారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా ఉచితాలు ప్రకటిస్తుంటారు. సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలకు తెరలేపుతుంటారు. ఇందులో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుంది. ఒక చోట వస్తువులు ఫ్రీ గా ఇస్తే మరోచోట సంక్షేమ పథకాలతో డబ్బులు ఖాతాల్లో వేస్తుంటారు.
పేర్లు మారినా.. ఉచిత ఆఫర్లు మాత్రం ఒక్కటే అంటున్నారు నిపుణులు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉచితాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఉచితాల కంటే ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. లేదంటే కోబ్రా ఎఫెక్ట్ తరహాలో పరిస్థితులు ఎదురవుతుంటాయని చెబుతున్నారు.
Also Read: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన
ఎన్నికలకు ముందు ఉచిత హామీలతో ఓటర్లను ప్రభావితం చేస్తు్న్నారు. అయితే అనంతర పరిస్థితులు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. మరియు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయి. ఉచిత విద్యుత్, నీరు లేదా నగదు బదిలీ కొంతమేర అణగారిన వర్గాలకు మేలు చేస్తుందనే అభిప్రాయం లేకపోలేదు. సబ్సిడీ ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సంక్షేమ చర్యలు మానవ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, బంగారు నాణేలు, నగదు వంటి ఉచితాలు ఆర్థిక అవసరాలకు బదులుగా రాజకీయ లక్ష్యాలకు దారితీస్తున్నాయి.