Big Stories

BRS Scams: పాపాల పుట్ట..! తవ్వేకొద్దీ బయటపడుతున్న బీఆర్ఎస్ బాగోతాలు..

KCR news today

- Advertisement -

BRS scams in telangana(Today breaking news in Telangana): అధికారం పోయాక బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓవైపు పార్టీ నేతలు వరుసగా జంప్ అవుతున్నారు. ఉన్న లీడర్లు ఎప్పుడు గుడ్ బై చెబుతారో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో కాగ్ రిపోర్టులు గులాబీ బాస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి బాగోతాల్ని బట్టబయలు చేసిన కాగ్.. తాజాగా కేసీఆర్ రూల్స్‌ అతిక్రమించి డబ్బు ఖర్చు చేసిన తీరును వివరించింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాల పుట్ట నానాటికీ పెరిగిపోతూనే ఉందనే చర్చ జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకు బయటకొచ్చినవి ఒక ఎత్తు.. తాజాగా వెలుగుచూసిన బాగోతం మరో ఎత్తుగా కనిపిస్తోంది.

- Advertisement -

ఏకంగా 2 లక్షల 88 వేల 811 కోట్ల రూపాయలను ఎలాంటి అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక బయటపెట్టింది. 2014-15 నుంచి 2021-22 ఆర్ధిక సంవత్సరం మధ్య.. కేసీఆర్ ఇష్టానుసారంగా ఆ సొమ్మను ఖర్చు చేశారని ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి, గొర్రెల కుంభకోణం, ధరణిలో అవకతవకలు, రైతు బంధులో నిధుల పక్కదారి ఇలా ఎన్నో బయటపడుతున్న తరుణంలో లక్షల కోట్లలో అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేయడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. 2014 నుంచి 2022 వరకు దాదాపు 3 లక్షల కోట్లను ఖర్చు చేస్తే.. 2022-23తో పాటు, గత ఎన్నికల వరకు ఇంకా ఎన్ని నిధుల్ని అనుమతులు లేకుండా విడుదలయ్యాయో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Read More: మత్తు.. చిత్తు.. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ ..

రాష్ట్ర స్థాయిలో, ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటున్న నిధుల విషయంలో.. శాసనసభలో సమావేశమైన మెజారిటీ ఎమ్మెల్యేల నుంచి ఆమోదం పొందాలి. కానీ, శాసనసభ అధికారానికి మించిన ఖర్చుల క్రమబద్ధీకరణ అంశాన్ని.. కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అదనపు వ్యయ బడ్జెట్, ఆర్థిక నియంత్రణ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడింది. ప్రజా వనరుల నిర్వహణలో కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణను విస్మరించారని కాగ్ విమర్శించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి అదనపు ఖర్చులు లేవని తేలింది.

అయితే, రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అదనపు వ్యయం పెరిగిందని కాగ్ వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు వ్యయం దాదాపు 5 వేల కోట్లు ఉంటే.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18 వేల 5 వందల కోట్ల రూపాయలకు పెరిగిందని స్పష్టం చేసింది. ఈ వ్యయం ప్రతి ఏడాది పెరుగుతూ.. చివరగా 21-22 ఆర్థిక సంవత్సరంలో 67 వేల కోట్ల రూపాయలకు పైగా చేరుకుందని ప్రకటించింది. అధిక వ్యయాన్ని పొందాలంటే శాసనసభలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో చర్చ జరిపి క్రమబద్ధీకరించాలి. కానీ, కేసీఆర్ ఈ నిబంధనలను కూడా తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించినట్టు కాగ్ ప్రశ్నించింది. ఈ రిపోర్ట్‌లో వెల్లడించిన వివరాలు చూసి.. కేసీఆర్‌పై ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News