Political Heat In BRS: తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి.. టిఆర్ఎస్ వ్యవస్థాపక నాయకుడు … తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌కు కుడి భుజంగా వ్యవహరించిన అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి రాజకీయాల్లో ఫోకస్ అయిన సీనియర్.. అలాంటి నాయకునిపైనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కక్షగట్టారట. రాజకీయాల నుండి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలోని రాజకీయాలు….కేసిఆర్ వర్సెస్ కేటీఆర్ అనేలా మారాయన్న టాక్ హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు..
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మధుసూదనాచారి
తొలి తెలంగాణ సభాపతి, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అంటే తెలుగు రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుండి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నాయకుడు. టీడీపీ ఆవిర్భావ సమయంలో రాజకీయ జీవితం ప్రారంభించి … టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్ కు వెన్నంటి ఉన్న నేత. భూపాలపల్లి నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌గా పనిచేశారు. 2018లో ఆయనకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ అధినేత తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు.
చౌరిని కాదని గండ్ర వెంకటరమణకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు భూపాలపల్లి టికెట్ ఆశించగా…. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇచ్చారు. విద్యార్థుల్లో మంచి పలుకుబడి ఉండి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బీసీ నేత మధుసూదనాచారిని ఎప్పటి నుండో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారని చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ మధుసూదనాచారికి కాకుండా గంటల వెంకటరమణ రెడ్డికి వచ్చేలా చేశారని చారి అనుచరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రెండు వర్గాలుగా చేరిపోయిన గులాబీ శ్రేణులు బహిరంగంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇక చారి వర్గం సపోర్ట్ చేయకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో గండ్ర వెంకటరమణారెడ్డి చిత్తుగా ఓడిపోయారు.
చారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్న కేడర్
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఆయన కుమారుడు సిరికొండ ప్రశాంత్ భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల నాటికి తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉండడం, పార్టీ శ్రేణులను పట్టించుకోకపోవడంతో.. పార్టీ క్యాడర్ మధుసూదనా చారికి తిరిగి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటోందంట. క్యాడర్ అభీష్టం మేరకు నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేస్తూ, ప్రత్యేక కార్యాలయాన్ని మధుసూదనాచారి ప్రారంభించుకున్నారు. నియోజకవర్గంలో బీసీ ప్రభావం ఎక్కువ ఉండడం, మధుసూదనా చారి సైతం బీసీ కావడంతో ద్వితీయ శ్రేణి నాయకుల నుండి చారికి మంచి సపోర్ట్ లభిస్తోందంటున్నారు.
భూపాలపల్లి గండ్రదే అని ప్రకటించిన కేటీఆర్
అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గంలో తన ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని గ్రహించి తిరిగి కుట్రలకు తెరలేపారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థలు ముంచుకొస్తున్న వేళ చారి ప్రభావంతో పార్టీ పూర్తిగా… తన చేయి దాటి పోతుంది అని గ్రహించి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన చేయించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ భూపాలపల్లి పర్యటన సందర్భంగా తనని సెగ్మెంట్లో భవిష్యత్తు నాయకుడిగా ప్రకటించాలని గండ్ర ప్రాధేయపడ్డారంట. అందుకే భూపాలపల్లి జిల్లాలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గం గండ్ర వెంకటరమణ రెడ్డి దే అంటూ కేటీఆర్ ప్రకటన చేశారంట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో చారి వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నాలు
అంతేకాకుండా, మధుసూదనాచారి సేవలు రాష్ట్రస్థాయిలో అవసరం ఉన్నాయంటూ, భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారి అవసరం లేదని కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించారంట. అయితే ఈ వ్యాఖ్యలపై చారి అనుచరులు భగ్గుమంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల ముందు మధుసూదనాచారి కి కాకుండా, అక్రమార్కుడైన గండ్రకు టికెట్ ఇచ్చి, పార్టీ ఓటమికి కేటీఆర్ కారకుడయ్యారని మండిపడుతున్నారట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మధుసూదనా చారిని పక్కకు పెట్టాలని ప్రయత్నం చేస్తే సహించబోమని చారి వద్ద వాపోతున్నారట. త్వరలోనే భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటన చేయాలంటూ చారి అనుచరులు ఆయనపై వత్తిడి తెస్తున్నారంట.
కేటీఆర్ తీరు కేసీఆర్‌ను వ్యతిరేకించే విధంగా ఉందని చర్చ
మాజీ ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీ మధుసూదనా చారి వర్గాలుగా విడిపోయిన బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట. మరోవైపు కేటీఆర్ తీరు కేసీఆర్ ను వ్యతిరేకించే విధంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు చారికి రావాల్సిన టికెట్‌ను అడ్డుకుని ఓటమి కారకుడైన కేటీఆర్ మరోసారి అదే తప్పు చేస్తున్నారని చారి అనుచరులు వాపోతున్నారట. మరోవైపు రాజకీయ పండితులు మాత్రం కేసిఆర్ సన్నిహితులను కేటీఆర్ రాజకీయాలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ సన్నిహితులు రాజకీయంగా పాతుకుపోతే భవిష్యత్తులో తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని, అందుకే ముందస్తు వ్యూహంతోనే కేటీఆర్ వ్యవహరిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
కేటీఆర్‌తో తేల్చుకోవడానికి సిద్దమవుతున్న మధుసూదనాచారి
మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మధుసూదనా చారి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తానో.. కేటిఆరో తేల్చుకునేందుకు త్వరలోనే భూపాలపల్లి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారట. తన వెంట కేసీఆర్ ఉండగా.. కేటీఆర్ కుప్పిగంతులు పనిచేయవని.. త్వరలోనే భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పినట్లు చారి అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి భూపాలపల్లిలో కేసీఆర్ వర్గం వర్సెస్ కేటీఆర్ వర్గం అన్నట్లు తయారైన బీఆర్ఎస్ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Story By Rami Reddy, Bigtv