ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ సర్వేలు చేయించుకోవడం కామన్. ప్రజల్లో పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది. ప్రజలు తమ పాలనతో సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారా? నిరుద్యోగుల అభిప్రాయం ఎలా ఉంది? పార్టీలో నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏమైనా పెరిగిందా? ఎవరైనా పార్టీలు మారే పరిస్థితులు ఉన్నాయా? అధికార పార్టీ మీద ప్రతిపక్షం ఎలాంటి ఎత్తులు వేయబోతున్నది? ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉన్నదా? లేదా? అని నిఘా వర్గాలు లేదా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం లేదా పార్టీ పెద్ద సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటారు.
గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏడాది లేదా ఆరునెలలకు ఒకసారి నిఘా వర్గాల ద్వారా సర్వే రిపోర్టులను తెప్పించుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయా? వ్యతిరేకత ఏమైనా పెరిగిందా? అని సర్వేలు చేయించినట్టు తెలిసింది. మొదటి టర్ములోనూ ఇలాగే చేసిన కేసీఆర్ రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రెండో టర్ము చివరలో సర్వే చేయించిన కేసీఆర్‌కు షాకింగ్ నిజాలు తెలిశాయి. పార్టీ ఓడిపోతున్నదని.. అందుకు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారమే కారణమని తెలిసింది. వారిని మార్చితే మరోసారి గులాబీ పార్టీ గెలిచే చాన్స్ ఉందని రిపోర్టు వచ్చింది. అయినా కేసీఆర్ మాత్రం అభ్యర్థులను మార్చకుండా బరిలోకి దిగడంతో ఆయన గద్దె దిగాల్సి వచ్చిందని తెలిసింది.
మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సర్వేల ద్వారా తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. వాటన్నింటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్ ఇస్తానని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఇంకో రెండేండ్లు పూర్తయి తీరా ఎన్నికల నాటికి ఎవరికైతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో వారికి టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నందున అవి పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం ఇప్పటికే ప్రకంటిచారు. ఈ రెండున్నరేండ్లలో ఎవరి పనితీరు బాలేదో వారిని మంత్రి వర్గం నుంచి తప్పించి కొత్త వారికి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లోనూ బీఫామ్స్ విషయంలో సీఎం ఎంత సీరియస్‌గా ఉంటారో ఇక్కడే అర్థం అవుతోంది.
s
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 99 రోజుల ‘ప్రజాపాలన-పట్టణ ప్రగతి’ కార్యక్రమాల ద్వారా పార్టీకి మైలేజ్ మరింత పెరిగినట్టు తెలుస్తోంది.నాయకులు అంతా ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడే సాల్వ్ చేస్తుండటంతో ప్రజల్లో నాయకులు, పార్టీపై మంచి అభిప్రాయం ఏర్పడినట్టు తెలుస్తోంది.మరో రెండేండ్లూ ఇలాగే పాలన సాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు ఉండదని నిఘా వర్గాలు నివేదిక తయారు చేసినట్టు తెలిసింది. ఇంకా అది సీఎం వద్దకు చేరలేదని.. త్వరలోనే చేరనుందని సమాచారం. ఆ రిపోర్టు ఆధారంగా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినా.. ప్రజల్లో లేకపోయినా వారికి సీఎం రేవంత్ భారీ షాక్ ఇస్తారని సైతం చర్చ జరుగుతోంది.కాగా, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా లేకపోవడం, గత సర్కారు స్కాములను బయటకు తేవడంలో రేవంత్ సర్కారు సఫలమైందని తెలుస్తున్నది.